సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్( Sagar Cement ) పరిశ్రమ మైనింగ్ ప్రాంత విస్తరణ అనుమతుల కోసం చేసుకున్న అర్జీకి అనుమతులు ఇవ్వాలా వద్దా అనే విషయంలో స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు( Pollution Control Board ) అధికారులు శనివారం పెదవీడు( Peddaveedu ) శివారులోని మైనింగ్ ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా 200 మంది పోలీసుల రక్షణ వలయంలో కొనసాగింది.
ఈ పబ్లిక్ ఇయరింగ్ ను శుక్రవారమే పెద్దవీడు గ్రామానికి చెందిన ప్రజలు స్థానిక గ్రామపంచాయతీ వద్దకు చేరుకొని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
దీనితో పోలీసులు వారిని గుర్తించి ముందస్తు అరెస్టు చేయడంతో పాటు పలువురిని సమావేశానికి రాకుండా అడ్డుకునేందుకు ఐదు పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఇక్కడికి వచ్చే ప్రజాప్రతినిధులు, విలేకరులు,స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏ ఒక్కరినీ వదలకుండా ప్రతిచోట్ల క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అయితే సాగర్ సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని సంస్థ యాజమాన్యం గుర్తించి వారి ఫొటోలతో సహా పోలీసులకు అందించి, వారు రాకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించడంతో పోలీసులు వారిని సులువుగా కట్టడి చేయగలిగారని,అందులో భాగంగానే మాట్లాడే వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు స్థానికులు ఆరోపించారు.
ఇదిలా ఉంటే ప్రజాభిప్రాయ సేకరణ తమకు ఇష్టం లేదని స్థానికులు వివిధ శాఖల అధికారులకు వినతిపత్రాలు అందజేసి, కోర్టును కూడా ఆశ్రయించారు.దీనితో పబ్లిక్ ఇయరింగ్ జరిపినా దాని ఆధారంగా వెంటనే అనుమతులు ఇవ్వొద్దని హైకోర్టు( High Court ) ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగాక కోర్టు అనుమతితో తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది.