సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో విషాన్ని విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న సువెన్ ఫార్మా కంపెనీని మూసివేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సువెన్ ఫార్మా కంపెనీ పరిసర ప్రాంతాల్లోని 5,6,వార్డులో దుర్వాసన వేదజల్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కంపెనీ నుండి వెలువడే వ్యర్థాలతో ప్రజలకు శ్వాసకోస,కిడ్నీ,గుండె జబ్బుల బారిన పడుతున్నారని, వాతావరణం అంతా కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కంపెనీ విస్తరణ పనులు తక్షణమే నిలిపివేయాలని అన్నారు.
వ్యర్ధ జలాలను రాత్రిపూట చుట్టుపక్కల పొలాలలో వదులుతూ ప్రజలకు హాని కలిగిస్తుందని,దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేశామని,18 వ వార్డుకు చెందిన శంకర్ నాయక్ పోలీసులతో కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురి చేస్తూ,ప్రజలకు ఆరోగ్య రక్షణ కింద సిఎస్ఐఆర్ నిధుల నుంచి పది లక్షల రూపాయలు అడిగితే నాపై తప్పుడు కేసులు పెట్టి పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారని, ఆరోపించారు.మొదట్లో 23 టీఎంపి ఉన్న కంపెనీ ప్రస్తుతం 250 టీఎంపీకి పెంచారని,దీనికి అనుమతులు ఎలా వచ్చాయని,23 టిఎంపి ఉంటేనే పొల్యూషన్ ఎక్కువగా ఉందని,అదే విధంగా 250 టిఎంపి పెంచితే ప్రజలు ఎలా జీవించాలని ప్రశ్నించారు.
సువేన్ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న తండాలతో పాటు జిల్లా కేంద్రం కూడా పొల్యూషన్ తో బారినపడి సతమతమవుతుంటే అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై రాజకీయ నాయకులకు అనేకసార్లు విన్నవించినా గిరిజన ప్రజల మీద ఏమాత్రం దయ చూపకపోవడంతో పాటు,ఈ సమస్య మీద ఎవరు పోరాడితే వాళ్లని బెదిరించి జైల్లో పెట్టిస్తున్నారని,సువెన్ ఫార్మా కంపెనీ పిఆర్ఓ రాములు పోలీసులను చెప్పు చేతల్లో పెట్టుకొని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
సువెన్ కంపెనీ విస్తరణ అనుమతులు రద్దు అయ్యేవరకు,కంపెనీ మూసే వరకు మా పోరాటం ఆగదని,గిరిజన లంబాడ హక్కుల సమితితో పాటు అనేక ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ జనసేన నాయకులు మరియు వివిధ సంఘాల గిరిజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.