ఏపీలో వరుస ఎన్నికలతో రాజకీయం హీటెక్కుతోంది.సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో వరుసగా ఎన్నికలు జరగుతున్నాయి.
ఇక తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.
రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీల స్థానాలకు సైతం నోటిఫికేషన్ వచ్చేసింది.ఆరుగురు కొత్త ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల కోటాలో ఎంపిక కానున్నారు.
ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం వైసీపీలో ఫైటింగ్ మామూలుగా లేదు.జగన్ గత ఎన్నికలకు ముందు నుంచే చాలా మంది నేతలకు ఎమ్మెల్సీ ఆశ పెట్టారు.
పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో సీఎం జగన్ ఎవరికి చాన్స్ ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.ఈ ఎమ్మెల్సీ లిస్టులో వినిపిస్తోన్న పేర్లలో గుంటూరు జిల్లా కు చెందిన సీనియర్ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, షేక్ ముజుబుల్ రెహమాన్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్ రాజు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కూడిపూడి చిట్టబ్బాయ్, తోట వాణి రేసులో ఉన్నారు.

ఇక కరోనాతో మృతి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడు బల్లి చక్రవర్తి పేరు కూడా ప్రచారంలో ఉంది.బల్లి ఫ్యామిలీకి న్యాయం చేసి ఉప ఎన్నికల్లో వేరే వ్యక్తికి సీటు ఇవ్వాలని జగన్ ఆలోచన చేస్తున్నారు.ఇక సినిమా రంగం నుంచి మోహన్ బాబు, అలీ, ఫృథ్వీ కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు.ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి సీటును కూడా ఆ కుటుంబానికి ఇవ్వాలా ? లేదా ఇతరులకు ఇవ్వాలా ? అని ఆలోచన జరుగుతోంది.మరి ఈ లక్కీ పర్సన్స్ ఎవరు ? అవుతారో ? చూడాలి.