నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి దళారులకు అడ్డాగా మారాయని రైతులు ఆరోపిస్తున్నారు.పత్తి కొనుగోలులో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై చేస్తున్న మాయాజాలానికి ఆరుగాలం కష్టపడి పండించిన పంట క్వింటాళ్ల కొద్ది నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు.
ఈ ఖరీప్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం పెరిగి దాదాపు లక్ష ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అధికారుల అంచనాలే చెబుతున్నాయి.జిల్లాలో పెద్ద మొత్తంలో పత్తి పండడంతో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీపీఐ (భారత పత్తి కార్పొరేషన్) కేంద్రాల్లో దళారులు దూరి రైతుల పాలిట శాపంగా మారారని వాపోతున్నారు.పత్తికి కనీస మద్దతు ధర క్వింటా రూ.7512 నుంచి రూ.7124 ఉండగా కేంద్రాల్లో మద్దతు ధర లభించడం లేదని,సీసీఐ అధికారులు,జిన్నింగ్ మిల్లు యజమానులు కుమ్మక్కై తేమ,నాణ్యత అంటూ కొర్రీలు పెడుతూ భారీ మొత్తంలో అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తొంది.కేంద్రాల వద్దకు రైతులు తెచ్చిన పత్తిని మిల్లర్లు,మధ్యవర్తులు కావాలనే ఆలస్యం చేస్తూ రోజుల తరబడి ఎదురుచూసేలా చేసి,ఆ తర్వాత రైతుల వద్దకు వచ్చి అధికారులతో మాట్లాడి సెటిల్ చేస్తామని రైతులను మభ్య పెడుతూ లోడు వాహనాలతో నిరీక్షించేలా చేయడం, మరుసటి రోజు వచ్చి కటింగ్, కమీషన్ అంటూ బుకాయించడంతో కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నల్లగొండ జిల్లా వింజమూరు గ్రామానికి చెందిన ఓ రైతు తన ట్రాక్టర్లో పత్తి తీసుకొని నాలుగు రోజుల క్రితం ఓ సీసీఐ కేంద్రానికి వెళ్లగా మొదటి రోజు నాణ్యత లేదని తిరస్కరించారని,ఆ రైతు మిల్లు యజమానిని సంప్రదించగా 1.5 క్వింటాళ్ల పత్తి కోత కోసుకొని ఒప్పందం చేసుకున్నట్లు,మరుసటి రోజు ఆమోదం ప్రకారం వాహనాన్ని తూకం చేయగా ఆన్లోడ్తో వాహనాన్ని తూకం చేసే సమయంలో 1.5క్వింటాళ్ల బరువుకు సమానంగా ముగ్గురు వ్యక్తులను వాహనంలోకి ఎక్కించి తూకం వేయించినట్లు బాధిత రైతు గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం.మరో రైతు నుంచి క్వింటా పత్తి కోత విధించారని, ఇలా కోత విధించిన పత్తికి వచ్చే డబ్బులను అధికారులు, యజమానులు కలిసి పంచుకుంటున్నట్లు వినికిడి.
సీసీఐ కేంద్రాలపై జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా దళారులు రాజ్యమేలుతున్నారు.రైతుల నుండి వచ్చిన పత్తిని కాకుండా డీసీఎం లారీల నుండి వచ్చిన పత్తిని కొనుగోలు చేస్తూ రైతులను రోజుల తరబడి నిరీక్షింప చేస్తున్నారని పలుమార్లు రోడ్లపై రాస్తారోకోలు చేసినా సీసీఐ అధికారులు స్పందించకపోవడం శోచనీయమని వాపోతున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సీసీఐ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించి,జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
.