సూర్యాపేట జిల్లా:అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా మారింది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ లో కిడ్నీ రోగుల పరిస్థితి.కిడ్నీ రోగుల డయాలసిస్ కోసం ఏర్పాటు చేసిన నూతన భవనం నత్తనడక నడుస్తూ ఉండడంతో డయాలసిస్ పేషంట్లు నానా తిప్పలు పడుతున్నారు.
ఏరియా ఆసుపత్రిలో ఐదు మిషన్లు ఉన్నప్పటికీ ప్రతిరోజు కిడ్నీ రోగులు సరైన వసతి లేక 5 షిప్ట్ ల ప్రకారం డయాలసిస్ చేయించుకుంటున్నారు.ఒక్కొక్క షిఫ్ట్ కు కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది.
కొత్తగా మరో ఐదు మిషన్లు శాంక్షన్ అయినా కానీ,పేషెంట్లకు ఉపయోగించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డయాలసిస్ సెంటర్ కోసం నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు.
కానీ,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల గత ఆరు నెలల నుంచి నిర్మాణ పనులు, చిన్న చిన్న పనులు జరగడం లేదని వాపోతున్నారు.హుజూర్ నగర్ లో రోజురోజుకు కిడ్నీ బాధితులు సంఖ్య పెరుగుతూ ఉందని, ప్రతిరోజు ఒక్కో షిఫ్ట్ కి నాలుగు గంటలుగా ఐదు బెడ్లు ఖాళీ లేకుండా ఐదుగురి రోగులకు మాత్రమే డయాలసిస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న కిడ్నీ రోగులకు డయాలసిస్ అపాయింట్మెంట్ దొరక్క వైద్యం సరైన సమయానికి అందడం లేదని,ఒకవేళ దొరికినా కానీ,రాత్రిపూట పది గంటల నుంచి రెండు గంటల వరకు ఎమర్జెన్సీ సేవలు ఆహార సదుపాయం మరియు ట్రాన్స్పోర్ట్ అందుబాటులో లేక డయాలసిస్ కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.త్వరగతిన భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తే మిగిలిన కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందించవచ్చని భావిస్తున్నారు.
తక్షణమే ప్రభుత్వ వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి నూతన సెంటర్ పనులు త్వరగా పూర్తి చేసి,డయాలసిస్ కిడ్నీ రోగులకు వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు.