నల్లగొండ జిల్లా:ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని,చివరకు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా, ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదని,వెంటనే కేంద్రాలను ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.శనివారం చిట్యాల మండలంలోని ఉరుమడ్ల,వట్టిమర్తి, వనిపాకల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుమడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంకాగా, వట్టిమర్తి,వనిపాకలలో నేటికీ ప్రారంభంకాలేదని, వనిపాకలకు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని,వెంటనే ఇవ్వాలని కోరారు.వరిపంట సగానికి సగం వేయలేదని,వేసిన కొంత భాగం మిల్లర్లకు అమ్మారని, స్వర్ణ,సన్నాలను ఇంకా కోయలేదని,కనీసం మార్కెట్లలో పోసిన ధాన్యానికి కూడా అతిగతీ లేదని విమర్శించారు.
ఏమాత్రం ఆలస్యమైనా వడగళ్ల వర్ష బీభత్సం వల్ల మళ్లీ రైతాంగం కన్నీరుమున్నీరయ్యే ప్రమాదం ఉన్నందున ప్రకృతి బీభత్సాలు సంభవించకముందే కొనుగోళ్లను పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీఆర్పీఎస్ జిల్లా నాయకులు,కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.