సూర్యాపేట జిల్లా:రెండు రోజుల క్రితం తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న 4 నెలల పసి బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూడడంతో జిల్లాలో సంచలనంగా మారింది.వివరాల్లోకి వెళితే చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలో ఇమ్మారెడ్డి సైదిరెడ్డి,విజయ దంపతులు తమ కుమారుడు శివ(4)ను ఆదివారం పక్కలో వేసుకొని నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆ బాలుడిని అపహరించారు.
కంగారు పడిన తల్లిదండ్రులు బాబు కనిపించట్లేదని వెంటనే చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో నాలుగు నెలల శిశువు అపహరణ పోలీసులకు సవాలుగా మారింది.రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ నేతృత్వంలో 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి,కిడ్నాప్ అయిన శిశువు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే సంఘటనపై పలువురు అనుమానితులను చివ్వెంల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.నూతనకల్ మండల కేంద్రానికి చెందిన ఇమ్మారెడ్డి సైదిరెడ్డి,విజయ దంపతులు గత కొన్ని నెలలుగా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి దేవాలయం సమీపంలో గుడారం వేసుకుని నివాసముంటున్నారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా,ఇటీవల ఓ కుమారుడు జన్మించారు.వీరు కొద్దిపాటి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు.
లింగమంతుల స్వామి గుడి వద్ద కొబ్బరికాయలు విక్రయించి జీవనం సాగిస్తున్నారు.ఈ దంపతుల కుమారుడిని అపహరించాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
సైదిరెడ్డి స్వగ్రామం నూతనకల్ మండల కేంద్రంలో ఆయన తల్లిదండ్రుల ఆస్తి నుంచి రావాల్సిన భూవాటా వివాదం ఏమైనా శిశువు కిడ్నాప్‌నకు కారణమై ఉంటుందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇటీవల ఓ వ్యక్తి బాధిత కుటుంబంతో పలుమార్లు వారి శిశువును విక్రయించాలని కోరినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా,అతడి పాత్రలేదని తెలుసుకున్నారు.పరిసర ప్రాంతాలను గాలించిన పోలీసులు మానసిక రుగ్మతతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఏమైనా చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న డీఎస్పీ మోహన్ కుమార్ చివ్వెంల పోలీస్ స్టేషన్లోనే ఉండి కేసు చేధించేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.