వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున టిడిపి, బిజెపి వంటి పార్టీల నుంచి నాయకులు వచ్చి అధికార పార్టీలో చేరిపోయారు.అధికార పార్టీలో ఉంటే కేసుల భయం ఉండదు అని, పదవులు వెతుకుంటూ వస్తాయని, ఇలా ఎన్నో కారణాలతో నాయకులు వైసీపీలోకి క్యూ కట్టారు.
కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామా చేసి అనధికారికంగా వైసీపీలో చేరారు.అంటే నేరుగా వైసీపీని వీడి టీడీపీలో చేరితే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఈ విధంగా అధికార పార్టీ లో చేరకుండా దగ్గర గా ఉంటున్నారు.
మరికొంత మంది ఎమ్మెల్యేలను టీడీపీకి దూరం చేయడం ద్వారా, తెలుగుదేశం పార్టీ కి ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టాలి అనేది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.అందుకే మరికొంత మంది ఎమ్మెల్యేలపై జగన్ దృష్టిపెట్టారు.
వారంతా వైసీపీ లోకి వచ్చి చేరతారని ఆశగా ఎదురు చూస్తున్నారు.కానీ ముందుగా వైసీపీ కి అనుబంధంగా ఉంటూ, టిడిపి కి రాజీనామా చేయాలని చూసిన ఎమ్మెల్యేలు ఇక్కడ పరిస్థితులను చూసి వెనక్కి తగ్గుతున్నారట.
ఆ లిస్ట్ లో ఇప్పుడు విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేరిపోయారు.
మొదటి నుంచి ఆయన వైసీపీ లోకి వచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు.
కానీ ఆయన పార్టీలో చేరకుండా విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ చక్రం తిప్పారు.దీంతో టిడిపికి రాజీనామా చేసి, వైసిపికి అనుబంధం కొనసాగే అవకాశం కోల్పోయారు.అయితే ఇప్పుడు విశాఖ పై పట్టు సంపాదించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.వైసిపిలోని బలమైన నాయకులను చేర్చుకుని, మరింత బలంగా మారాలని చూస్తున్నారు.
విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు, ఆ తరువాత పరిపాలన రాజధాని గా విశాఖను అధికారికంగా ప్రకటించి, అక్కడ నుంచే పరిపాలన కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉన్న నేపథ్యంలో, గంటాను చేర్చుకునేందుకు వైసిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు విజయసాయిరెడ్డి సైతం గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారు అంటూ గంట శ్రీనివాసరావు అనుచరుడు వైసీపీలో చేరిన సందర్భంగా ప్రకటించారు.
కానీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను గంటా శ్రీనివాసరావు ఖండించారు.
వైసీపీ లోకి తాను వెళ్లడం లేదని, టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు.ఈ విధంగా గంటా యూ టర్న్ తీసుకోవడానికి కారణం, మొదట్లో ఉన్నంత స్థాయిలో వైసీపీకి ఆదరణ లేదని, ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నా, అవన్నీ అప్పులు ద్వారానే తెస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆ అప్పులు కూడా ఏపీకి దొరకడం కష్టమైపోతుంది అని, అలాగే కేంద్ర అధికార పార్టీ బిజెపి సహకారం వైసీపీకి లేకపోవడం, ఏపీకి నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం పక్షపాత ధోరణి, ఇలా ఎన్నో అంశాలు వైసీపీకి ప్రతికూలంగా మారుతాయి అని గంటా అంచనా వేస్తున్నారు.ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో వైసీపీలో సరైన ప్రాధాన్యం దక్కకపోవడం, ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక మిగతా టిడిపి ఎమ్మెల్యేలతో పాటు కీలకమైన నాయకులు ఇప్పుడు వైసీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డారట.