హైదరాబాద్ మహానగరంలో మణికొండ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.గంజాయి మత్తులో ఉన్న ఈ గ్యాంగ్ పోచమ్మ కాలనీకి ( Pochamma Colony )చెందిన ఓ యువకుడిని విచక్షణారహితంగా చితకబాదింది.
ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.దాడి అనంతరం గ్యాంగ్ తమ బైక్‌ను అక్కడే వదిలి పరారైంది.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే, ఈ దాడిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో( Rayadurgam Police Station ) కేసు నమోదైంది.ఈ బ్యాచ్ రాత్రి వేళ అడ్డూ అదుపు లేకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.
ఇదే తరహాలో గతంలో పాలమూరు పట్టణంలో ఓ యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి చేసింది.ఆ ఘటన మరవక ముందే, మహబూబ్‌నగర్ టౌన్‌లో మరో ఘటన చోటుచేసుకుంది.

రెండు రోజుల కిందట కూడా మహబూబ్‌నగర్ న్యూటౌన్‌లో గంజాయి బ్యాచ్ సభ్యులు పరస్పరం పదునైన ఆయుధాలతో దాడికి దిగారు.స్థానికుల సమాచారంతో పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు.మహబూబ్‌నగర్ డీఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఇటీవల కాలంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌లు పెచ్చరిల్లిపోతున్నాయి.
ఈ ముఠాలను సమూలంగా అణిచివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.పోలీసు శాఖ మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, నేరస్తులకు ఉపేక్ష లభించకూడదని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







