నల్లగొండ జిల్లా: ప్రసవ వేదనతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ పట్ల విధుల్లో ఉన్న వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సభ్య సమాజం తల దించుకునే సంఘటన నల్లగొండ జిల్లా కేంద్ర ఏరియా ఆసుపత్రిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన నల్లవెల్లి ఆంజనేయులు భార్య అశ్విని ప్రసవ వేదనతో గురువారం రాత్రి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది.ఇక్కడ డాక్టర్లు లేరని,నల్లగొండ పెద్దాసుపత్రి తీసుకెళ్ళాలి నిండు నెలల గర్భిణిని భయబ్రాంతులకు గురి చేస్తూ అక్కడి నుంచి పంపించారు.
పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉండడంతో కుటుంబసభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేవరకొండ నుండి అంబులెన్స్ లో నల్లగొండ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు.
నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వెంటనే జాయిన్ చేసుకోవాల్సిన డ్యూటీ సిబ్బంది (నర్సులు) నిర్లక్ష్యంగా మూడో కాన్పు దేవరకొండలో చేయించక ఇక్కడికి ఎందుకొచ్చారని తిడుతూ ఆమెను బయట కుర్చీలోనే కూర్చోబెట్టారు.
నొప్పులు వస్తున్నాయని ఎంత వేడుకున్నా కనికరం లేకుండా కసాయి వారిలా ప్రవర్తించారు.దీనితో చేసేదేమీ లేక తీవ్రమైన ప్రసవనొప్పులతో బాధ పడుతూ ఆ తల్లి కూర్చున్న కుర్చీలోనే డెలివరీ కాగా కుర్చీ కింద తీవ్ర రక్తస్రావం జరిగింది.
అప్పుడు హడావిడిగా వచ్చి కుటుంబ సభ్యులను తిడుతూ చీదరించుకుంటూ తరువాత లోపలికి తీసుకెళ్ళారు.
ఇదంతా చూస్తున్న వారందరూ డాక్టర్, నర్సుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితి ఏ స్త్రీకి రాకూడదని బాధితురాలి భర్త ఆంజనేయులు కన్నీటి పర్యంతమయ్యారు.పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంటే,ప్రజలు కట్టే పన్నులతో లక్షలు లక్షలు జీతాలు తీసుకునే వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రజల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడంపై పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
దేవరకొండలో డ్యూటీలో లేని డాక్టర్ల పైన,నల్లగొండలో డ్యూటీలో ఉన్న డాక్టర్,నర్సులపైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.