నల్లగొండ జిల్లా:రైతును ఒకవైపు ప్రభుత్వాలు, దళారులు మోసం చేస్తుంటే మరోవైపు ప్రకృతి కూడా పగపట్టి ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో బుధవారం తెల్లవారుజామున నుండే మొదలైన అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది.
మార్కెట్ యార్డుల్లో,ఐకేపీ కేంద్రాల్లో రోజుల తరబడి నిల్వ ఉన్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.దీనితో రైతులు ప్రభుత్వ విధానంపై మండిపడుతున్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో హాలియా వ్యవసాయ మార్కెట్ నందు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మార్కెట్ కు వచ్చి15 రోజులు అవుతున్నా,ధాన్యం బస్తాలు ఇవ్వడం లేదని,ధాన్యం కాంటా వేయలేదని, లంచం ఇచ్చినోళ్ళకే బస్తాలు ఇస్తున్నారని,వర్షానికి కప్పడానికి సరైన పట్టాలు కూడా లేవని అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని గోడు వెల్లబోసుకున్నారు.
హాలియా వ్యవసాయ మార్కెట్ నందు ఎండబెట్టిన వరి ధాన్యం అకాల వర్షానికి నీటి పాలైందని రైతులు బోరున విలపించారు.మార్కెట్లో,ఐకెపి కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.