దేశానికే రోల్ మోడల్ తెలంగాణ : రాష్ట్ర మంత్రి కే తారకరామారావు

9 ఎండ్ల అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు( CM KCR ) సారథ్యంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కే తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 Minister Ktr Participates Telangana Formation Day Celebrations At Rajanna Sircil-TeluguStop.com

అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు.తెలంగాణ , రాజన్న సిరిసిల్ల లో అమలవుతున్న అభివృధి, సంక్షేమ కార్యక్రమా ల ప్రగతిని వివరించారు.

ప్రజా భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల అధికారుల సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపామని అన్నారు.అనంతరం రాష్ట్ర మంత్రి కే తారకరామారావు( Minister K Tarakaramarao ) దశాబ్ది ఉత్సవ పురస్కరించుకొని ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాగిన స్వరాష్ట్ర సాధన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ శుభాభివందనాలు.

ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తునన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఈ రోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు .ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుది( Telangana State Decade Celebrations )ద్దుకున్నది.ప్రజాసంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది.“తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది” అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది.ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలన వీటన్నిటి కలయిక అయిన ‘తెలంగాణ మోడల్’ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నదన్నారు.ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది.

సంక్షోభ సమయాలలోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది.రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం.అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తనకంటూ ప్రత్యేకత నిలుపుకుంటూ అన్ని రంగాలలో అంతకుముందెన్నడూ లేని విధంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తుంది.

పండుగలా వ్యవసాయం:

ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే, ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది.సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నది.తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదేండ్లలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు అరకొర నిధులు ఖర్చు చేయగా, రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసింది.నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతుల కళ్ళలో దీనత్వం తొలిగి, ధీరత్వం తొణికిసలాడుతున్నది.

గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు.ఒకటా.రెండా… లెక్కకు మించిన అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమలులోకి తీసుకొచ్చారు.దుక్కి దున్నింది మొదలుకొని పండిన ప్రతిగింజా కొనుగోలు చేసేదాకా అడుగడుగునా రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపారు.

సాగుజలాలు, భూగర్భ జలాల లభ్యత పెరగడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2016 లో ఉన్న 1 లక్షా 77 వేల 960 ఎకరాలలో నికర సాగుభూమి కాస్త 2023 నాటికి 2 లక్షల 40 వేల 430 ఎకరాలకు పెరిగింది.రైతుబంధు పథకం ద్వారా ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇప్పటివరకూ 10 విడతల్లో సుమారు 1 లక్షా 33 వేల 658 మంది రైతులకు 1 వేయి 139 కోట్ల రూపాయలను ముందస్తు పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలలో నేరుగా జమ చేశాం.

రైతులకు సుస్థిర ఆదాయం రావాలి, మెరుగ్గా బ్రతకాలి అనే ఉద్దేశ్యంతో తెలంగాణాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారిగా ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్ లో 1 వేయి కోట్లను కేటాయించాం.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 973 ఎకరాలలో 292 మంది రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్నారు.రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4 వేల 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 10 గోడౌన్లు ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 33 కోట్లతో 55 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 14 ఆధునిక వ్యవసాయ గోదాములను నిర్మించాం.తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు మాత్రమే ఉండగా, రైతుల సౌలభ్యం కోసం కొత్తగా 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేశాం.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ గ్రామంలో 20 కోట్ల రూపాయలతో 25 ఎకరాలలో సువిశాల అధునాతన మార్కెట్ యార్డును నిర్మించాం.అంతే కాకుండా రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వీలుగా 5 కోట్ల 15 లక్షల రూపాయలతో సిరిసిల్లలో రైతుబజార్ ను నిర్మించాం.

రైతుభీమా పథకం( Rythu Bhima Scheme ) ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు వివిధ కారణాలతో అకాల మరణం చెందిన 1 వేయి 803 మంది రైతుల కుటుంబాలకు 90 కోట్ల 15 లక్షల రూపాయల బీమా పరిహారం చెల్లించాం.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 క్లస్టర్ ల పరిధిలో రైతువేదికలను నిర్మించాం.

సాగు విస్తీర్ణం పెరగడంతో నర్మాలలో 309 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం.ఈ పార్క్ లో 150 కోట్ల రూపాయలతో 3 పరిశ్రమలు నిర్మిస్తున్నాం.

ఈ పరిశ్రమల నిర్మాణం పూర్తయితే సుమారు 800 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla )లో నలుదిక్కులా వ్యవసాయనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.

వ్యవసాయ కళాశాల సమీపంలో వ్యవసాయ రిసోర్స్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.బందనకల్ గ్రామంలో నూనె గింజల పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం.

పెద్దూర్ లో అపెరల్ పార్క్, వివింగ్ పార్క్, నర్మాలలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం.ధార్మికక్షేత్రం వేములవాడను ఆధ్యాత్మిక టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయనున్నాం.

జిల్లాలో వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గ్రౌండ్ నట్ ఆయిల్, టర్మెరిక్ పౌడర్, ఫ్లోర్ మిల్, అటుకుల తయారీ, పికిల్ యూనిట్, తదితర వ్యవసాయ ఆధారిత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు సన్నాహాలు చేస్తున్నాం.తద్వారా స్థానికంగానే నిరుద్యోగ యువత, మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుంది.

విద్యుత్ రంగం:

అన్ని రంగాలకు 24 గంటలతో పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశ దిశల వ్యాపించింది.

తెలంగాణాలో కరెంటు కోతలు పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ బావులకు ప్రతినెల 27 కోట్ల రూపాయలు వెచ్చించి 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లాలో కేవలం 33/11 కె.వి.సబ్ స్టేషన్లు 43 ఉండగా, తొమ్మిదేండ్లలో కొత్తగా 33/11 కె.వి.సబ్ స్టేషన్లు మరో 33 ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 132 కె.వి.సబ్ స్టేషన్లు 4 ఉండగా, తొమ్మిదేండ్లలో కొత్తగా 132 కె.వి.సబ్ స్టేషన్లు మరో 2 ఏర్పాటు చేశాం.జిల్లాలో 2014 సంవత్సరంలో విద్యుత్ వాడకం 567 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 985 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వాడుతున్నారు.తలసరి విద్యుత్ వినియోగం 2014 లో 885 యూనిట్లు ఉంటే అది 2023 నాటికి 1 వేయి 645 యూనిట్లకు పెరిగింది.

మెట్టప్రాంతంలో జలసిరులు:

వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగెల్లుతున్న చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్ లకు వెళ్ళుతున్న నదీ జలాలు సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను అవిష్కరిస్తున్నాయి.సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది.

బావులు, బోర్లె దిక్కయిపోయిన రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యలపాలైంది.నేడు స్వరాష్ట్రంలో తెలంగాణా సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది.

భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్ష్యాత్కరిస్తున్నది.అన్నపూర్ణగా అవతరించి దేశానికే అన్నం పెడుతున్నది.

జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12 ల ద్వారా 1 లక్షా 39 వేల 246 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు) ద్వారా 55 వేల 980 ఎకరాలకు, మైనర్, మీడియం ఇరిగేషన్ ద్వారా 57 వేల 146 ఎకరాలకు మొత్తం 2 లక్షల 52 వేల 372 ఎకరాలకు సాగునీరు అందుతుంది.కాళేశ్వరం ప్రాజెక్టు తో మానేరు నది ఇప్పటికే జీవనదిగా ఆవిర్భవించింది.

జలాశయాల నిర్మాణం పూర్తి కావడంతో మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే భూగర్భజల మట్టం గణనీయంగా పెరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ప్యాకేజి-9 మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ ఇటీవలే విజయవంతం అయింది.దీని ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని 96 వేల 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.

మధ్య మానేరులో అతిపెద్ద ఆక్వాహబ్:


Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

తెలంగాణ మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.ఇప్పటికే చేపపిల్లల ఉచిత పంపిణీతో మత్స్య రంగం దశ దిశలు మార్చిన తెలంగాణ ప్రభుత్వం, మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2 వేల కోట్ల భారీ పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధినిచ్చేలా మధ్యమానేరులో 366 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అక్వాహబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

దీని ద్వారా 5 వేల మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.ఆక్వా రంగంలో పేరున్న అమెరికాకు చెందిన ఫిషిన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం.అలాగే ఫ్రెష్ టూ హోమ్, ఆనందా గ్రూప్, సీపీ ఆక్వా గ్రూప్ సంస్థలు ఈ ఆక్వా హబ్ లో పెట్టుబడులు పెట్టనున్నాయి.త్వరలోనే ఆక్వా హబ్ కు శంకుస్థాపన చేయనున్నాం.అక్వాహబ్ ను జిల్లాలో కొత్తగా రానున్న రైల్వే ప్రాజెక్టుతో అనుసంధానం చేయనున్నాం.

జలవిప్లవానికి తోడు మరో నాలుగు విప్లవాలు:

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో నిర్మించిన తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో జల విప్లవం వచ్చింది.దీనికి పునాదిగా మరో నాలుగు విప్లవాలు హరిత విప్లవం.గులాబీ, నీలి, క్షీర విప్లవాలను చూస్తున్నాం.పచ్చని మొక్కలతో హరిత విప్లవం, మాంస ఉత్పత్తితో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలి విప్లవం, పాడిపశువుల అభివృద్ధి వల్ల క్షీర విప్లవాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.

మిషన్ కాకతీయ:

కాకతీయుల నుండి అసఫ్ జాహీల దాకా నిర్మించి, పరిరక్షించిన చెరువులు సమైక్య రాష్ట్రంలో శిథిలమైపోయాయి.కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సారథిగా పగ్గాలు చేపట్టిన వెంటనే చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టారు.ఈ పథకం గొప్ప ఫలితాలను ఇచ్చింది.

చెరువులు బాగుపడడంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరిగింది.ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి.

ఈ పథకంలో భాగంగా జిల్లాలో నాలుగు దశల క్రింద ఇప్పటివరకు 102 కోట్ల 79 లక్షల రూపాయలతో 294 చెరువుల పనులు పూర్తయ్యాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా లో మానేరు వాగుపైన అప్పర్ మానేరు, మిడ్ మానేరు మధ్య 11, మూలవాగు పై 13 చెక్ డ్యామ్ లను మొత్తం 24 చెక్ డ్యామ్ లను 155 కోట్ల రూపాయలతో చేపట్టాము.ఇందులో 7 చెక్ డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి.13 చెక్ డ్యాం పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి.మిగతా పనులు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయి.

మిషన్ భగీరథ:

ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్ళాలంటే జంకే పరిస్థితి ఉండేది.మహిళలు ఖాళీ బిందెలతో ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికేవారు.అట్లాంటి పరిస్థితి నుండి మిషన్ భగీరథ కార్యక్రమంతో నేడు దేశంలో తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

దీని ప్రేరణగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం “ హర్ ఘర్ జల్ యోజన” కార్యక్రమాన్ని చేపట్టడం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణం.మిషన్ భగీరథ పథకం క్రింద జిల్లాలో 1 వేయి 258 కోట్ల రూపాయలను వెచ్చించి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా సురక్షిత త్రాగునీరు అందిస్తున్నాం.

డబుల్ బెడ్ రూం ఇండ్లు:


Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

స్వరాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవనం సాగించేలా అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తుంది.జిల్లాలో ఇప్పటి వరకు 3 వేల 443 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశాం.తంగళ్ళపల్లి మండలం మండెపల్లి శివారులో సిరిసిల్ల పట్టణ లబ్దిదారులకు 27 ఎకరాల్లో సుమారు 87 కోట్ల 67 లక్షల రూపాయలతో నిర్మించిన 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకున్నాం.రగుడు, శాంతి నగర్, పెద్దూర్ లో 792 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మితమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ దేశానికే సరికొత్త పంథాను నిర్దేశిస్తున్నాయి.సొంత జాగాలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరఫున మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే “గృహలక్ష్మి” కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నాం.

‘తెలంగాణకు హరితహారం’:

పర్యావరణ పరిరక్షణకు ప్రతి మానవుని విద్యుక్త ధర్మంగా భావించే మన ముఖ్యమంత్రి ‘తెలంగాణాకు హరితహారం’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు.తెలంగాణకు హరితహారం( Harithaharam ) స్థాయిలో మరే రాష్ట్రంలోనూ మొక్కలు నాటి, కాపాడే కార్యక్రమం అమలు కావడం లేదంటే అతిశయోక్తి లేదు.

రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీలు తమ వార్షిక బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించి పచ్చదనం పెంపునకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాయి.జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది విడతలలో 4 కోట్ల 67 లక్షల మొక్కలను జిల్లా వ్యాప్తంగా నాటాము.

“ఆసరా”:

ముఖ్యమంత్ర్రి కేసీఆర్ అభిప్రాయం ప్రకారం పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్ధిక ప్రగతి అస్థిరమైనది, అనైతికమైనది.ఆ ఉద్దేశ్యంతోనే పరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహ భాగం నిధులను వెచ్చిస్తున్నది.

గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా 200 రూపాయలు పెన్షన్ ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం ఆసరా ఫించన్ కింద ఇచ్చే మొత్తాన్ని 2 వేల 16 రూపాయలకు పెంచింది.దివ్యాంగులకు 3 వేల 16 రూపాయలకు పెంచింది.

ఎవ్వరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, పైలేరియా బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు సైతం 2 వేల 16 రూపాయల ఫించన్ నెల నెలా అందజేస్తుంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం జిల్లాలో 56,116 మందికి మాత్రమే పెన్షన్ అందేది.ప్రస్తుతం జిల్లాలో 1 లక్షా 21 వేల 142 మంది నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు,గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు అండగా నిలవడం సామాజిక బాధత్యగా భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు ప్రతినెల 25 కోట్ల 75 లక్షల రూపాయలను పెన్షన్ల క్రింద పంపిణీ చేస్తుంది.

‘కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్’:

ఆడ పిల్లల పెండ్లి ఖర్చుల భారం భరించలేక నిరుపేద కుటుంబాలు పడుతున్న బాధలు చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారి భారాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో హామీ ఇవ్వకపోయినా కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.ఈ పథకం కింద కుల మతాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1 లక్షా 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నది.జిల్లాలో ఇప్పటివరకూ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 21 వేల 534 మందికి 194 కోట్ల 4 లక్షల 72 వేల రూపాయలు, షాదీ ముబారక్ పథకం ద్వారా 984 మందికి 8 కోట్ల 68 లక్షల 57 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశాం.

కొనసాగింపు….

వైద్య,ఆరోగ్య రంగం:

దేశంలోకెల్లా అత్యుత్తమమైన సేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతి సాధించింది.సమైక్య రాష్ట్రంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి నుంచి ఆరోగ్యం మెరుగవ్వాలంటే సర్కారు దవాఖానకే పోవాలె అనేలా కార్పోరేట్ కే పరిమితమైన ఖరీదైన వైద్యసేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చాం.తెలంగాణ రాకముందు 30 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా, తెలంగాణ వచ్చిన తర్వాత 100 పడకల ఆసుపత్రిగా ఉన్న జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి ఇప్పుడు 330 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (మెడికల్ కళాశాల) గా అప్ గ్రేడ్ చేయడం జరిగింది.

ఈ ఆసుపత్రిలో రక్తనిధి, మాతాశిశు సంరక్షణ కేంద్రం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, డయాలసిస్ కేంద్రంను రోగుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చాం.ఎలక్ట్రానిక్ ఐసీయూ ద్వారా నిమ్స్ తో ఒప్పందం చేసుకుని రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందజేస్తున్నాం.

స్టెమీ టెలీప్రోగ్రాం ద్వారా గుండె జబ్బు రోగులకు చికిత్సలు అందజేస్తున్నాం.అలాగే ఆసుపత్రిలో 170 పడకలకు సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించడం జరిగింది.వైద్య, విద్య పటిష్టతకు ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉండగా, కొత్తగా జిల్లా కేంద్రంకు ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా మంజూరు చేశాం.ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం కానున్నాయి.

జిల్లా వైద్యారోగ్య రంగంలో ప్రభుత్వ వైద్య కళాశాల గేమ్ చేంజర్ గా నిలవనుంది.

అప్పుడే పుట్టిన నవజాత శిశువుల కొరకు ప్రత్యేకంగా ఎన్.బి.సి.యూ వార్డును, రేడియాలజీ విభాగం నందు సిటీ స్కాన్, సియాన్, డిజిటల్ ఎక్స్ రే, అల్ట్రా సౌండ్ మిషన్, 2డి ఈకో సౌకర్యం, డెడికేటెడ్ పిడియాట్రిక్ కేర్ యూనిట్, సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి గ్రస్తులకు నిక్షయ పోషణ యోజన ద్వారా చికిత్సతో పాటూ నెలకు 500 రూపాయల చొప్పున ఆర్ధిక ప్రయోజనం అందజేస్తున్నాం.

నిరాశ, నిస్సహాయ స్థితిలో ఉండి, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు “కిరణం” అనే టోల్ ఫ్రీ కేంద్రాన్ని ప్రారంభించి, టెలీ కౌన్సిలింగ్ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది.

వేములవాడ మండలం( Vemulawada ) తిప్పాపూర్ గ్రామంలో ప్రాంతీయ వైద్యశాలను ప్రారంభించుకున్నాం.10 పడకల సామర్థ్యం కలిగిన పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని, 10 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ వార్డు, సిటీ స్కాన్ కేంద్రం, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును, టీబీ రోగనిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని, 12 పడకల సామర్థ్యం గల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, డిజిటల్ ఎక్స్ రే కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది.5 పడకల సామర్థ్యంతో కూడిన డయాలసిస్ కేంద్రంతో పాటు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు చికిత్స అందించేందుకు ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

కే‌సి‌ఆర్ కిట్:

జిల్లాలో ఇప్పటి వరకు 17 వేల 163 మంది బాలింతలకు కె.సి.ఆర్ కిట్ లను పంపిణీ చేయడం జరిగింది.గర్భవతులు, బాలింతలకు వారి ఖాతాలో 19 కోట్ల 76 లక్షల 25 వేల రూపాయలు కే‌సి‌ఆర్ కిట్ లో భాగంగా జమ చేయడం జరిగింది.జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకం అమలు తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు 47 శాతం నుండి 62 శాతంకు పెరిగాయి.

కంటి వెలుగు- ఆరోగ్య మహిళా:

“సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అని ఆర్యోక్తి.చూపు తగ్గితే జీవితం మసకబారి పోతుంది.రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నది.తొలిదశ విజయం స్ఫూర్తితో రెండవదశ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశాం.మన జిల్లాలో 26 బృందాలతో కంటి వెలుగు క్యాంపులు వైద్యారోగ్య, పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో నిర్వహించాం.

జిల్లాలోని 255 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో 18 సంవత్సరాలు పైబడిన వారికి షెడ్యూల్ వారీగా కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాం.ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 2 లక్షల 76 వేల 834 మందికి కంటి పరీక్షలు చేసి, 47 వేల 194 మందికి రీడింగ్ గ్లాసులు, 40 వేల 987 మందికి పాయింట్ గ్లాసులు అందజేశాం.
ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలతో కూడిన చికిత్సను అందించేందుకు మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆరోగ్య మహిళా కింద ఎంపిక చేశాం.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేకంగా మహిళా వైద్యులచే వైద్య సేవలు అందించడంతో పాటు 8 రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది.ఇప్పటివరకు జిల్లాలో 4 వేల 443 మంది మహిళలకు వైద్య పరీక్షలు చేసి, 170 మందిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి పంపించడం జరిగింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం:

పేద ప్రజలకు మెరుగైన, నాణ్యత ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది.జిల్లాలోని కోనరావుపేట, తంగళ్ళపల్లి, కొదురుపాక, సుందరయ్య నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ క్వాలిటీ అస్స్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేట్ ను కైవసం చేసుకోవడం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన, నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నాయని తెలపడానికి నిదర్శనం.అలాగే జిల్లా ఆసుపత్రి, వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రితో పాటు 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాష్ట్రంలోనే తొలిసారిగా కీళ్ళ నొప్పులు, పక్షవాతం, వెన్నుపూస నొప్పులతో బాధపడుతున్న వారి కోసం ఫిజియోథెరపీ సేవలను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

రోడ్లు, భవనాలు మరియు మౌళిక వసతుల కల్పన:

సిరిసిల్ల పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు 95 కోట్ల రూపాయలతో 11 కిలోమీటర్ల మేర రగుడు నుండి వెంకటాపూర్ వరకు నిర్మిస్తున్న 4 వరుసల బైపాస్ రహదారి నిర్మాణం పూర్తిచేశాం.అలాగే ఎల్లమ్మ జంక్షన్ నుండి రగుడు వరకు 35 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

జిల్లా కేంద్రం సిరిసిల్లలో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా అన్ని హంగులతో సెల్లార్ తో కూడిన మూడు అంతస్తుల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం 64 కోట్ల 70 లక్షల రూపాయలతో సర్వాంగ సుందరంగా నిర్మించబడి అందుబాటులోకి వచ్చింది.సిరిసిల్లలో 8 కోట్ల 50 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని త్వరలోనే ప్రారంభించనున్నాం.

ఆరోగ్య లక్ష్మి:

జిల్లాలోని 587 అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 0-6 సంవత్సరాల పిల్లలకు వివిధ రకాల పోషణ ఆరోగ్య సేవలను ప్రభుత్వం తరపున అందిస్తున్నాం.ఆరోగ్య లక్ష్మి పథకం( Arogya Lakshmi Scheme ) ద్వారా 3 వేల 757 మంది గర్భిణీలు, 3 వేల 893 మంది బాలింతలకు, 15 వేల 856 మంది 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనం, ప్రతి రోజు గుడ్డు, పాలు అందించడం జరుగుతుంది.18 వేల 126 మంది 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతం ప్యాకెట్లు, గ్రుడ్లు టేక్ హోమ్ రేషన్ క్రింద అందిస్తున్నాం.జిల్లాలో 13 అంగన్వాడీ కేంద్రాలను మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా అభివృద్ధి చేశాం.

వృద్ధులకు బాసటగా డే కేర్ సెంటర్:

మలిసంధ్యలో ఉన్న వృద్ధులు ఆత్మగౌరవంతో బ్రతికేలా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వృద్ధుల సంరక్షణ కేంద్రం (డే కేర్ సెంటర్) ను ఏర్పాటు చేశాం.నిరాదరణకు గురైన వృద్ధులు జీవితచరమాంకంలో ఉల్లాసంగా గడిపేందుకు 40 లక్షల రూపాయల నిధులతో 20 పడకల సామర్థ్యం, ఫిజియోథెరపీ సౌకర్యం, టీవీ, ఆట వస్తువులు, గార్డెన్ తో ఈ సంరక్షణ కేంద్రాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం.93 లక్షల రూపాయలతో ప్రభుత్వ పరంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్మించిన వృద్ధాశ్రమం త్వరలో ప్రారంభించనున్నాం.

ధాన్యం సేకరణ:

వరి సాగు చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ వారు పండిస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వ మద్ధతు ధరకు కొనుగోలు చేస్తుంది.2021-2022 యాసంగి సీజన్ లో 514 కోట్ల రూపాయల విలువైన 2 లక్షల 62 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 46 వేల 583 మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం.2022-2023 వానాకాలం సీజన్ లో 484 కోట్ల రూపాయల విలువైన 2 లక్షల 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 47 వేల 122 మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం.2022-23 యాసంగి సీజన్ లో ఇప్పటివరకు 255 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 29 వేల 968 మంది రైతుల నుంచి 1 లక్ష 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.రైతుల బ్యాంకు ఖాతాలలో ధాన్యం డబ్బులు ఇప్పటివరకు 119 కోట్ల రూపాయలను జమచేశాం.మిగితా ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరలో కొనుగోలు చేస్తాం.

దళిత బంధు:

శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణ కోసం దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా దళితుల అభ్యున్నతిని కాంక్షించి చేపట్టిన గొప్ప పథకం దళితబంధు.దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన ఈ పథకం దళితుల పాలిట భాగ్యరేఖగా మారింది.జిల్లాలో దళితబంధు పథకం( Dalit Bandhu Scheme )లో భాగంగా వెటర్నరీ రంగంలో 63, పరిశ్రమల రంగంలో 54, ఇతర రంగాల్లో 89 మొత్తం 206 మంది లబ్దిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ చేసే పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం ప్రతీ లబ్దిదారునితో ప్రత్యేకంగా సమావేశమై ఫ్లోర్ మిల్, మొబైల్ రైస్ మిల్, దాల్ మిల్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోల్ బంక్, ఫిష్ కల్చర్, కాంక్రీట్ మిల్లర్, సిమెంట్ బ్రిక్స్, రైస్ మిల్, రైస్ డిపో, మెడికల్ షాప్, ఎలక్ట్రానిక్ గూడ్స్ షో రూమ్, సూపర్ మార్కెట్ వంటి లాభదాయక యూనిట్లను స్థాపించుకునేలా దళితబంధు లబ్దిదారులకు మార్గదర్శనం చేయడం జరిగింది.దశలవారిగా జిల్లాలోని పేద దళిత కుటుంబాలకు దళితబందు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం సంతృప్తస్థాయిలో అందజేయనుంది.

పోడు భూములకు పట్టాల పంపిణీ:

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 6 మండలాల పరిధిలో 60 గ్రామాలకు చెందిన 1 వేయి 614 మంది గిరిజన రైతులకు 2 వేల 858 ఎకరాలకు సంబంధించిన పోడు భూముల పట్టాలను త్వరలోనే అందజేయనున్నాం.

మైనారిటీ సంక్షేమం:

అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది.స్వయం ఉపాధి పథకాల క్రింద బ్యాంకుల ద్వారా సబ్సిడీ రూపంలో ఇప్పటి వరకు 146 మంది లబ్దిదారులకు 1 కోటి 13 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగింది.ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలకు సంబంధించిన మసీదులు, షాదీఖానాలు, చర్చీలు, కమ్యూనిటీ హాల్ ల నిర్మాణం కొరకు గ్రాంట్ – ఇన్ ఎయిడ్ పథకం క్రింద 98 పనులకు గానూ 5 కోట్ల 61 లక్షల రూపాయలు మంజూరు చేశాం.అల్పసంఖ్యాక వర్గాల మహిళలకు 500 కుట్టు మిషన్లు పంపిణీ చేశాం.

ఎడ్యుకేషన్ హబ్ గా రాజన్న సిరిసిల్ల:

విద్యతోనే భవితకు పునాది, భావితరాలకు పురోగతి అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.జిల్లాలో ఐటీఐ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, డా.బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారింది.

మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి:

మన రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దశల వారీగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వ మన ఊరు-మన బడి( Mana Ooru – Mana Badi ), మన బస్తీ-మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.

మన జిల్లాలో మొత్తం 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఈ సంవత్సరం జిల్లాలో 48 కోట్ల రూపాయలతో 172 పాఠశాలల్లో విద్యుద్ధీకరణ, త్రాగునీటి సరఫరా, అదనంగా ప్రహారీ గోడ, టాయిలెట్ల నిర్మాణం, వంటగది నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడం జరిగింది.జిల్లాలోని పది పాఠశాలల్లో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ కార్పోరేట్ సంస్థల సహకారంతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.

గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణలోనే మొట్టమొదటి కేజీ టూ పీజీ సముదాయమును ఇటీవలే ప్రారంభించుకున్నాం.వీటితో పాటు అన్ని మండల కేంద్రాల్లోని పాఠశాలలను సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తున్నాం.

టి.ఎస్.ఐ పాస్:

జిల్లా ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పాలసీ క్రింద 1 వేయి 289 కోట్ల రూపాయల పెట్టుబడితో 809 పరిశ్రమలు స్థాపించబడి ఉత్పత్తి ప్రారంభించాయి.తద్వారా 6 వేల 472 మందికి ఉపాధి కల్పించాం.జిల్లాలో షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులకు టి –ప్రైడ్ క్రింద 1 వేయి 70, పరిశ్రమలు, రవాణా వాహనాల కొనుగోలుకు గానూ 55 కోట్ల 78 లక్షల రూపాయలను రాయితీగా అందించగా, టి – ఐడియా క్రింద 32 పరిశ్రమల స్థాపనకు గానూ 96 కోట్ల 21 లక్షల రూపాయలను రాయితీగా అందించాం.

జిల్లా కేంద్రం అభివృద్ధి:

ఒకప్పుడు సిరిసిల్ల అంటే అభివృద్ధికి నోచుకోని పట్టణం, విషాద పట్టణం అనే పేరు ఉండేది.గడిచిన దశాబ్ద కాలంలో సిరిసిల్ల పట్టణం అన్ని మౌలిక సదుపాయాలను పెంపొందించుకుని అభివృద్ధికి చిరునామాగా ఎదిగింది.అనేక రంగాల్లో దేశానికి, రాష్ట్రానికి సిరిసిల్ల ఆదర్శంగా నిలుస్తోంది.అనేక అవార్డులతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీల్లో జాతీయ స్థాయిలో 1 లక్ష లోపు జనాభా గల కేటగిరిలో దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్రమైన పట్టణంగా మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 పోటీల్లోను స్వీయ స్థిరమైన నగరం గా వరుసగా రెండు సార్లు జాతీయ స్థాయిలో అవార్డు సొంతం చేసుకుంది.2021-22 సంవత్సరంకు గానూ పట్టణ ప్రగతి ఇన్నోవేషన్ అవార్డుల్లో సిరిసిల్ల రాష్ట్రంలోనే మొట్ట మొదటి స్థానం పొందింది.అలాగే సిరిసిల్ల పట్టణం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పట్టణంగా జాతీయ స్థాయిలో ధృవీకరించబడింది.2022-23 ఆర్థిక సంవత్సరంకు గానూ ఆస్తి పన్ను వసూళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రం లోనే సిరిసిల్ల ప్రథమ స్థానం చేజిక్కించుకుంది.ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి, సహకారంతో సిరిసిల్ల పట్టణం రాష్ట్ర, దేశం స్థాయిలో అనేక అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంటూ దేశంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది.సిరిసిల్ల పట్టణంలో మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను 100 కోట్లకు పైగా రూపాయలతో చేపడుతున్నాం.

పార్కుల అభివృద్ధి, ప్రధానమైన మురికి కాలువల నిర్మాణం, వైకుంఠధామాలు, కూడళ్ళ అభివృద్ధి, సి.సి.రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాం.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మానేరు నదీ తీరాన సుందరమైన బతుకమ్మ ఘాట్ ను నిర్మించుకున్నాం.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారుల అభివృద్ధితో పాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం.వెంకంపేట లో సైంటిఫిక్ మోడ్రన్ ధోబీ ఘాట్ ను, రాజీవ్ నగర్ లో మినీ స్టేడియం, బస్తీ దవాఖానను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.

పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు వీలుగా కొత్త చెరువు బండ్ అభివృద్ధి చేసి అందులో పార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం.శాంతినగర్ లో 61 కోట్ల రూపాయలతో 6 ఎకరాల స్థలంలో పట్టణం నలుమూలల నుండి వచ్చే మురికి నీటిని శుద్ధి చేసేందుకు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను నిర్మిస్తున్నాం.7 కోట్ల 70 లక్షల రూపాయలతో రగుడు జంక్షన్ అభివృద్ధితో పాటు రెండవ బైపాస్ రోడ్ ఆద్యాంతం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నాం.

సిరిసిల్ల మున్సిపాలిటీ( Sircilla Municipality ) సమీపంలో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు వీలుగా 6 కోట్ల రూపాయలతో అటవీ, మున్సిపాలిటీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వెంకటాపూర్ శివారులోని పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు ను త్వరలోనే ప్రారంభించనున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube