రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన గ్రామాల్లో పర్యటించాలని, నిత్యం పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు.ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేరు చేసి ఇచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు.వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని, ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు.
అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటిని కచ్చితంగా క్లోరినేషన్ చేయించాలని, నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని వివరించారు.
ఇక్కడ జడ్పీ సీఈవో ఉమారాణి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో లు రమేష్, రాజేశ్వర్, డీ ఆర్డీఓ శేషాద్రి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, డీపీఓ వీర బుచ్చయ్య, జిల్లా వైద్యాధికారి వసంత రావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్, ఎస్డీసీ రాధాభాయ్, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా వెటర్నరీ అధికారి, డీఏఓ భాస్కర్, మిషన్ భగీరథ ఈఈలు విజయ్ కుమార్, జానకి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.