సూర్యాపేట జిల్లా:విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్ వర్మ విమర్శించారు.గురువారం జిల్లా కేంద్రంలోని అరవై అడుగుల రోడ్డులో ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడాతూ గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు అందచేయాల్సిన స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందన్నారు.దీని ద్వారా పేద,బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కళాశాల ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్,ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజుల దోపిడీ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నియంత్రించకపోగా ఆ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో,సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని,పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్,కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని,సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన బిల్లులు తక్షణమే విడుదల చేయాలన్నారు.లేని పక్షంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలతో పాటు ప్రగతి భవన్ ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు భానోతు వినోద్,కుమార్,ఉమామహేష్,నవీన్,మధు, సల్మాన్,అనిల్,సందీప్,గోపీ,ప్రసాద్,కావ్య,ఉజ్వల, శ్రావణి,శృతి,రమ్య,ఆశాలత తదితరులు పాల్గొన్నారు.