ఈ మధ్య కాలంలో టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.ఈ క్రమంలో కొందరు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించడం మరియు ఆర్థిక లావాదేవీలు అలాగే సోషల్ మీడియా మాధ్యమాలు వంటి వాటి ద్వారా చాలా విషయాలను తెలుసుకుంటున్నారు.
అయితే టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే చెడు లాభాలు కూడా ఉన్నాయి.ఈ మధ్యకాలంలో కొందరు యువత సెల్ ఫోన్లను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తూ కటకటాల పాలవుతున్నారు.
కాగా తాజాగా ఓ యువకుడు డబ్బులు ముద్రిస్తూ నకిలీ నోట్లను మార్చుతుండగా పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.
పూర్తి వివరాల్లోకి వెళితే రాజు ప్రసాద్ అనే 28 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వ్యక్తి పటాన్ చెరువు పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
అయితే రాజు కుటుంబ పోషణ నిమిత్తమై ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.అయితే ఈ మధ్యకాలంలో రాజు ప్రసాద్ సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఉపయోగిస్తున్నాడు.
ఈ క్రమంలో అప్పుడప్పుడు కాలక్షేపం కోసం యూట్యూబ్ లో వీడియోలను తెగ చూసేవాడు.దీంతో అనుకోకుండా ఓ రోజున కరెన్సీ నోట్లను ఎలా ముద్రించాలనే వీడియోని చూశాడు.
దీంతో తాను కూడా ఈ కరెన్సీ నోట్లను ముద్రిస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆలోచన తట్టింది.దీంతో వెంటనే కరెన్సీ నోట్లను ముద్రించడానికి కావలసిన పరికరాలను కొనుగోలు చేశాడు.
అనంతరం వీడియోలో చూపించిన విధంగానే నకిలీ 2000 రూపాయల కరెన్సీ నోట్లను ముద్రించాడు.అయితే ఎక్కువ కరెన్సీ నోట్లను ముద్రిస్తే అనుమానం వస్తుందని కొద్ది మొత్తంలో ముద్రించి వాటిని స్థానికంగా ఉన్న చిన్న చిన్న షాపులలో మార్చుకునే వాడు.అయితే తాజాగా ఓ షాపు యజమాని ఈ దొంగ నోట్ల బాగోతాన్ని గుర్తించాడు.దీంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించి రాజుని పోలీసులకు పట్టించాడు.
తమదైన శైలిలో విచారించిన పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకుని అవాక్కయ్యారు.