అమెరికా గగనతలంలో పెను విషాదం చోటుచేసుకుంది.రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ ( Ronald Reagan Airport)వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో 26 ఏళ్ల భారత సంతతి మహిళ అష్రా హుస్సేన్ రాజా (Ashra Hussain Raja)కూడా ఉండటం మరింత కలచివేస్తోంది.ఆర్మీ హెలికాప్టర్, జెట్‌లైనర్ (Army helicopter, jetliner)ఢీకొనడంతో ఈ దారుణ ఘటన సంభవించింది.2001 తర్వాత అమెరికాలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం కావడం కలవరపెడుతోంది.అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342 బుధవారం రాత్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుండగా ఈ ఘోరం జరిగింది.
వాషింగ్టన్ డీసీలో కన్సల్టెంట్‌గా (consultant in Washington, DC)ఉద్యోగం చేస్తున్న అష్రా, వివాహం తర్వాత కూడా తన కెరీర్‌లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.వృత్తిరీత్యా నెలకు రెండుసార్లు విచితాలోని హాస్పిటల్ ప్రాజెక్ట్ కోసం ఆమె ప్రయాణాలు చేసేవారు.2020లో ఇండియానా యూనివర్సిటీలో పట్టా పుచ్చుకున్న అష్రా, 2023 ఆగస్టులో తన కాలేజ్ స్వీట్‌హార్ట్ హమాద్‌ను ప్రేమించి పెళ్లాడారు.ఇంతలోనే విధి ఆమెను ఇలా అర్ధాంతరంగా బలి తీసుకోవడం అందరినీ కన్నీటి సంద్రంలో ముంచెత్తుతోంది.
అష్రా ఎంత మంచి మనసున్న మనిషో ఆమె మామ డాక్టర్ హాషిమ్ రాజా(Dr.Hashim Raja) కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు.తాను ఎమర్జెన్సీ డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే, తాను నిద్రపోకుండా ఉండటానికి అష్రా అర్ధరాత్రి కూడా ఫోన్ చేసేదని ఆయన చెప్పారు.“అష్రా ఎప్పుడూ అందరి గురించి ఆలోచించేది, ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించేది” అంటూ ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.చివరిసారిగా అష్రా తనకు పంపిన మెసేజ్‌ను తలుచుకుంటూ భర్త హమాద్ రాజా గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.“మేం 20 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నాం” అని ఆమె మెసేజ్ చేసిందని, ఆమె కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా సైరన్‌లు మోగుతూ ఎమర్జెన్సీ వాహనాలు పరుగులు తీయడం చూశానని, ఆ తర్వాత తన మెసేజ్‌లు వెళ్లడం లేదని హమాద్ చెప్పారు.
“ఇదంతా ఒక పీడకలలా ఉంది” అంటూ హమాద్ కన్నీటి పర్యంతమయ్యారు.“ఇలాంటి ప్రమాదాలు ఎక్కడో జరుగుతాయని వింటాం కానీ, మన జీవితంలోనే జరుగుతాయని కలలో కూడా అనుకోలేదు” అని వాపోయారు.ట్విట్టర్‌లో ప్రమాదం గురించి చూసిన తర్వాత అది తన భార్య ప్రయాణిస్తున్న ఫ్లైట్ అని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.ప్రస్తుతం హమాద్ కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య శోకసంద్రంలో మునిగిపోయారు.
అష్రా మరణం వారి ఇంట తీరని విషాదాన్ని నింపింది.