నల్లగొండ జిల్లా:స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతుండడంతో ఆశావాహ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.పంచాయతీ ఎన్నికలు ముందుంటాయా…? ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు ముందుంటాయా అనేది అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు.అధికారులు స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి అన్నిరకాలుగా సన్నద్ధం అవుతుండడంతో,ప్రభుత్వం నుండి మాత్రం ఏ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తుందో క్లారిటీ రావట్లేదని పరేషాన్ లో పడ్డారు.బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో,ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముందుగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని,ఐతే సర్పంచ్ల పదవి కాలం ముందుగా ముగియడంతో పంచాయతీ ఎన్నికలే ముందు నిర్వహిస్తారని రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఆశావహ అభ్యర్థులు గ్రామాల్లో అప్పుడే సందడి మొదలు పెట్టారు.గతకొంత కాలంగా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి లక్షల్లో ఖర్చు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.ఇటీవల పరిషత్తు ఎన్నికలు ముందుగా జరుగుతాయనే ప్రచారం ఊపందుకోవడంతో సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్న ఆశావహ అభ్యర్థులు ఒకింత అసహనానికి గురవుతున్నారు.ప్రభుత్వం పార్టీ గుర్తుతో కూడిన పరిషత్తు ఎన్నికలు ముందుగా నిర్వహించి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఎన్నికల కమిషన్ పరిషత్తు ఎన్నికలు నిర్వహణకు అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.ఏదేమైనా మరో వారం రోజుల్లో నోటిఫికేషన్,ఈ నెలాఖరులోగా పరిషత్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనిపై ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే కానీ,ఏది ముందు ఏది తర్వాత అనేది తెలిసేలా ఉంది.నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ టెన్సన్ మెయింటేన్ చేయకతప్పని పరిస్థితి నెలకొంది.