యాదాద్రి భువనగిరి జిల్లా: మనిషి మరణానంతరం సకల సౌకర్యాల నడుమ దహన సంస్కారాలు జరగాలని గత ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన వైకుంఠ ధామాలు అంత్యక్రియలకు అక్కెరకు రాకుండా పడి ఉన్న పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కనిపిస్తుంది.గ్రామంలో నిర్మించిన వైకుంఠ ధామంలో దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత జరిగే కార్యక్రమాలకు అనువుగా స్నానపు గదులు,బట్టలు మార్చుకొనే గదులు, వాటర్ ట్యాంక్ నిర్మించారు.
కానీ,నేటికీ అవి ప్రారంభానికి నోచుకోక,ప్రజలకు ఉపయోగపడే అవకాశం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు.వాటర్ ట్యాంక్ కి నీటి సరఫరా లేదు,భవనంలోకి కరెంట్ కనెక్షన్ లేదు,ఆ గదులకు వేసిన తాళాలు తీసేది లేదు.
కేవలం చూసి మురవడానికి మాత్రమే వైకుంఠ ధామం ఉందని, నిర్మించి గాలికొదిలేశారని ఆరోపిస్తున్నారు.దహన సంస్కారాల అనంతరం వారి కుటుంబ సభ్యులు, బంధువులు డబ్బులు పెట్టి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి కార్యక్రమాలు నిర్వహించుకునే దుస్తితి నెలకొందని,కనీసం గదుల్లో స్నానాలు చేసి,బట్టలు మార్చుకొనే అవకాశం లేకుండా గదులకు తాళాలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.