సూర్యాపేట జిల్లా: పాత పెన్షన్ పునరుద్ధరణ రాష్ట్రాలకు తీవ్ర ఆర్థిక భారం అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక సహేతుకం కాదని సిపిఎస్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ అన్నారు.చాలా కాలంగా ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న డిమాండ్ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని,వారి ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చాలా రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చాయన్నారు.
2004 నుండి కూడా ఇంకా పాత పెన్షన్ అమలు చేస్తున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎలాంటి ఆర్థిక భారం లేదని,ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీయలేదని గుర్తు చేశారు.పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన సరియైనది కాదన్నారు.