సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం దేశంలోని 70 కోట్ల మంది బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని రాజ్యసభ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.మంగళవారం న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబిసి మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం బీసీల సంఖ్యను లెక్కించకపోవడం దురదృష్టకరమని, బీసీలకు రావాల్సిన వాటా ప్రకారం 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ మరియు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా వచ్చిన అనేక బీసీ కమిషన్లు గానీ,దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే వచ్చిన 240 బీసీ కమిషన్లు కూడా కుల గణన చేయాల్సిందేనని సిఫార్సులు చేసినా కేంద్ర ప్రభుత్వం మొండిగా, గుడ్డిగా,అవివేకంతో ఒప్పకోవడం లేదని విమర్శించారు.
జనగణనలలో బీసీ కులగణన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మద్దతు తెలుపుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాశారని గుర్తు చేశారు.తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని,వారికి రాజకీయంగా మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్సీల పదవులతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహా నగరంలో 28 బీసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇచ్చిన ఘనత ఈ దేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
పార్లమెంట్ సభ్యునిగా బీసీలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, కేంద్రం అవలంభిస్తున్న బీసీల వ్యతిరేక వైఖరిపై ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంతో పోరాటం చేస్తామని అన్నారుఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర,బీద మస్తాన్ రావు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్,దేశ వ్యాప్తంగా వున్న బీసీ సంఘాల నాయకులు,కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
.