సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీ విధానాలే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
దేశాన్ని కరువు కాటకాలకు నెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు మర్చిపోలేదన్నారు.తెలంగాణ తెచ్చిందెవరో ఇచ్చిందెవరో గత రెండు ఎన్నికలలో తెలంగాణ ప్రజలు స్పష్టం చేశారన్నారు.
కాంగ్రెస్‌ను చూసి ఎవరూ భయపడటం లేదని ప్రజలే భయపడుతున్నారని దుయ్యబట్టారు.మీడియా సెన్సేషన్ కోసం కాంగ్రెస్ నాయకులు పాట్లు పడుతున్నారని ఎద్దేవ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎండ్రకిచ్చల గుంపని ఒకరి నాయకత్వాన్ని మరొకరు గౌరవించలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.కొంగ జపం చేస్తే మోస పోయే చేప పిల్లలు తెలంగాణ ప్రజలు కాదన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌పై నమ్మకంతో ఉన్నారని,దేశంలో ఆకలి లేని రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు.దేశమంతా కరెంట్ కోతలతో మగ్గిపోతుంటే తెలంగాణ రాష్ట్రం పున్నమి వెన్నెలలా వెలిగిపోతుందన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో అలజడి సృష్టించేందుకు చిల్లర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ యువత చైతన్య వంతమైందన్నారు.
కాంగ్రెస్‌కు అండగా ఉంటారనుకున్న యువత ఉద్యోగాల నోటిఫికేషన్‌తో చేజారిపోతున్నారని కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారన్నారు.