సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.ఈ విధంగా ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి తేజ్ ను పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించగా అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు.
మొదట్లో అతి వేగం కారణంగా ప్రమాదానికి గురైనట్లు భావించినప్పటికీ రోడ్డుపై మట్టి బురద ఉండడం చేత ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం అపోలో చికిత్స తీసుకుంటున్న సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.
ఆయనకు అంతర్గత గాయాలు ఏవి కాకపోవడంతో పెద్ద ప్రమాదమేమీ చోటు చేసుకోలేదని వైద్యులు వెల్లడించారు.ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని వైద్యులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి మాదాపూర్ పోలీసులు అధికారికంగా ఓ ప్రకటన చేశారు.సాయి తేజ్ బండి నడుపుతూ ప్రమాదానికి గురైన బండి సెకండ్ హ్యాండ్ బైక్ అని మాదాపూర్ డీసీపీ తెలిపారు.
ఎల్బీనగర్కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తిపై ఈ బైక్ రిజిస్ట్రేషన్ అయి ఉంది.ఈ క్రమంలోనే అనిల్ అనే వ్యక్తి నుంచి ఈ బండి సాయిధరమ్ కొన్నారని తెలియడంతో ప్రస్తుతం పోలీసులు అతనిని పిలిపించి విచారిస్తున్నారు.గతంలో కూడా మాదాపూర్లోని పర్వతాపూర్ వద్ద ఓవర్ స్పీడ్ వెళ్లడంతో రూ.1,135 చలానా వేశామని, ఆ చలానాను సాయి ధరమ్ తేజ్ అభిమాని ఈ రోజు కట్టినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రమాదానికి గురైన సమయంలో సాయి తేజ కేవలం 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో సిటీ సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం సాయి ధరమ్ తేజ్ ఆటోను ఓవర్టేక్ చేయబోతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గురైనప్పుడు అతను హెల్మెట్ ధరించి ఉన్నాడని లేకపోతే మరింత ప్రమాదం చోటు చేసుకునేదని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.