ఎవరూ ఊహించని స్థాయిలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.మే 30 వ తేదీన ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేసుకుంటున్న జగన్ కొత్త ప్రభుత్వంలో కీలకమైన విభాగాల్లో బాబు కోటరీగా ముద్రపడ్డ అధికారులు ఎవరూ లేకుండా మొత్తం తమకు అనుకూలంగా ఉండేవారినే నియమించుకునేందుకు కసరత్తు అప్పుడే మొదలుపెట్టారు.
ఇప్పటికే పలువురు దీనిపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో చర్చలు జరిగినట్లు సమాచారం.చంద్రబాబు కీలక పదవుల్లో తనకు అత్యంత నమ్మకమైన వారిని నియమించుకున్నారు.
ప్రభుత్వానికి సంబంధించి రహస్య నిర్ణయాలు, విషయాలు బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొనేవారు.ఇప్పుడు కూడా ఆవిధంగానే తమకు పూర్తి అనుకూలంగా ఉండేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.
ఆ బాధ్యతను కాస్తా జగన్ ఎల్వీకే అప్పగించినట్టు కూడా తెలుస్తోంది.మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పూర్తిగా అధికారుల బదిలీల మీదే దృష్టిపెట్టే అవకాశం కనిపిస్తోంది.
జగన్ ఎంచుకునే అధికారుల్లో కొంతమందిని పరిశీలిస్తే రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లాంరెడ్డి, ఐవీఆర్ కృష్ణారావు వంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట.గతంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పీవీ రమేష్ ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చారు.
రెండు నెలల్లో రిటైర్ కానున్న ఈ అధికారి ప్రస్తుతం జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.రిటైర్‌మెంట్ తరువాత కూడా జగన్ ప్రభుత్వం ఈయనకు ప్రాధాన్యమైన పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందట.
![-Telugu Political News -Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2019/05/jagan-mohan-ready-tomake-own-team.jpg)
బాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు, సీఎంవోలో పనిచేస్తున్న జీఏడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీకాంత్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజమౌళి, సాయి ప్రసాద్, స్పెషల్ సెక్రెటరీ టూ సీఎం సతీష్ చంద్ర, స్పెషల్ సెక్రెటరీ టూ సీఎం గిరిజా శంకర్, సీఆర్డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రెటరీ ముద్దాడ రవిచంద్ర, ఏపీఎడీసీ ఎండీ వెంకయ్య చౌదరి, ఎనర్జీ అండ్ సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్, సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్, ఏపీపీఎఫ్ఎస్ఎస్ సీఈవో క్రిష్ణదేవరాయలు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ వెంకటేశ్వర్లు వున్నారు.వీరిలో క్రిష్ణమోహన్ రిటైర్డ్ అధికారి.వాసిరెడ్డి క్రిష్ణదేవరాయలు బయటి వ్యక్తి కాబట్టి ఈయనకు పూర్తిగా తొలిగిస్తారట.కీలకమైన ఏ విభాగాన్ని విడిచిపెట్టకుండా అందరిని బదిలీ చేసే ఆలోచనలో జగన్ ఉన్నారట.ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.