తాజాగా జరిగిన ఓ షాకింగ్ ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ప్రపంచంలోనే తొలి బహిరంగ స్వలింగ సంపర్కుడు ఇమామ్‌గా( Gay Imam ) గుర్తింపు పొందిన ముహ్సిన్ హెండ్రిక్స్‌ను( Muhsin Hendricks ) దారుణంగా హత్య చేశారు.
సమాజంలో మార్పు కోసం గళం విప్పడమే ఆయన పాలిట శాపమై నిలిచిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సౌతాఫ్రికాలోని( South Africa ) గ్కెబెర్హా నగరంలో శనివారం ఈ షాకింగ్ ఘటన జరిగింది.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
హెండ్రిక్స్ కారులో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఉన్నట్టుండి వేరే వాహనం వచ్చి వారి కారుకు అడ్డంగా ఆగింది.మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా కారుపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు.
డ్రైవర్ భయంతో వణికిపోతూ వెనక్కి తిరిగి చూడగా.బ్యాక్ సీట్లో కూర్చున్న హెండ్రిక్స్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు.
హంతకులు మాత్రం రెప్పపాటులో అక్కడి నుంచి పరారయ్యారు.
బెథెల్స్‌డార్ప్ ప్రాంతంలో ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవుతోంది.పోలీసులు ఆ వీడియో నిజమైనదేనని ధృవీకరించారు.
అయితే, ఈ హత్యకు గల కారణాలు మాత్రం ఇంకా మిస్టరీగానే ఉన్నాయి.ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ దారుణ హత్యను అంతర్జాతీయ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్, ఇంటర్‌సెక్స్ అసోసియేషన్( ILGA ) తీవ్రంగా ఖండించింది.ఇది కచ్చితంగా ద్వేషపూరిత నేరమే అయి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, సమగ్ర విచారణ జరపాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జూలియా ఎహర్ట్ డిమాండ్ చేశారు.
ముహ్సిన్ హెండ్రిక్స్ ఇస్లాంలో LGBTQ+ హక్కుల కోసం గట్టిగా పోరాడిన వ్యక్తి.1996లోనే తాను స్వలింగ సంపర్కుడినని బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఆ తర్వాత LGBTQ+ ముస్లింలకు నాయకుడిగా ఎదిగాడు.2011లో కేప్ టౌన్ సమీపంలో ‘అల్-గుర్బాహ్’ అనే మసీదును స్థాపించి, తమ విశ్వాసాన్ని ఆచరించడానికి సురక్షితమైన స్థలాన్ని కల్పించాడు.ముఖ్యంగా క్వీర్ ముస్లింలు, సమాజంలో అణగారిన మహిళల కోసం ఆయన ఎంతో కృషి చేశాడు.
2022లో ‘ది రాడికల్’ పేరుతో ఆయన జీవితం ఆధారంగా డాక్యుమెంటరీ కూడా విడుదలైంది.తన ప్రాణాలకు ముప్పు ఉందని, బెదిరింపులు వస్తున్నాయని హెండ్రిక్స్ స్వయంగా చెప్పాడు.బాడీగార్డ్‌లను పెట్టుకోమని చాలామంది సలహా ఇచ్చినా ఆయన తిరస్కరించాడు.“చావు భయం కంటే నిజాయితీగా జీవించాలనే కోరిక నాకు ఎక్కువ” అని ఆయన ధైర్యంగా చెప్పేవాడు.
ముస్లిం కుటుంబంలో పుట్టిన హెండ్రిక్స్ మొదట ఒక మహిళను వివాహం చేసుకున్నాడు.
పిల్లలు కూడా కలిగిన తర్వాత విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత 29 ఏళ్ల వయస్సులో తాను గే అని ప్రపంచానికి తెలియజేశాడు.హత్య జరిగిన సౌతాఫ్రికాలో నేరాలు చాలా ఎక్కువ.2023 నుంచి 2024 మధ్య కాలంలోనే దాదాపు 28,000 హత్యలు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో హెండ్రిక్స్ హత్య సంచలనంగా మారింది.