అమెరికా చట్ట సభల్లో శాసనకర్తలుగా, స్థానిక ప్రభుత్వాలు, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు ఏకంగా అగ్రరాజ్యానికి రెండో శక్తివంతమైన పదవిని పొందడం నిజంగా ఒక కొత్త శకానికి ఆరంభం.అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి దక్షిణాసియా వాసిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
అంతేకాదు.పరిస్ధితులు అనుకూలంగా వుంటే 2024లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని కూడా ఆమె అధిరోహిస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.
అయితే అమెరికన్ మార్కెట్‌లోకి త్వరలో విడుదల కానున్న ఒక పుస్తకం ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్‌ను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ తీవ్రంగా వ్యతిరేకించారన్నది ఆ పుస్తకంలోని సారాంశం.
డెమొక్రాటిక్ ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా జో బైడెన్‌పై కమలా హారిస్ విమర్శలు చేశారు.దీనిని మనసులో పెట్టుకున్న జిల్ .ఆమెను వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా ఆమోదించలేకపోయారని ఆ పుస్తకంలో వివరించారు.
ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లు జోనాథన్ మార్టిన్, అలెక్స్ బర్న్స్‌లు రచించిన “This Will Not Pass: Trump, Biden, and the Battle for America’s Future” పుస్తకంలో వారిద్దరూ జిల్ బైడెన్ మనోగతాన్ని వెల్లడించారు.‘‘ దేశంలో మిలియన్ల మంది ప్రజలు వున్నారు… అలాంటప్పుడు ‘ఆమె’ ఎందుకు, జోపై విమర్శలు చేసిన వ్యక్తిని ఎంచుకోవాలా.? అని జిల్ వ్యాఖ్యానించినట్లు ప్రస్తావించారు.

డెమొక్రాటిక్ ప్రైమరీలలో ఇతర ప్రధాన అభ్యర్ధుల కంటే జో బైడెన్‌పై కమలా హారిస్ ఘాటు విమర్శలు చేసినట్లు పుస్తకం పేర్కొంది.2019 జూన్‌లో జరిగిన తొలి డెమొక్రాటిక్ డిబేట్‌లో కమలా హారిస్- జో బైడెన్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.ఇదే సమయంలో హారిస్‌ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఎంచుకోవడానికి బైడెన్ సంకోచించడాన్ని పుస్తకంలో వివరించినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది.
ఉపాధ్యక్ష అభ్యర్ధి కోసం న్యూ మెక్సికో గవర్నర్ మిచెల్ లుజన్ గ్రిషమ్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్, స్టాసీ అబ్రమ్స్‌లను కూడా బైడెన్ పరిశీలించినట్లుగా తెలిపారు.