మూడేళ్ల క్రితం భారత్- అమెరికాలలో తీవ్ర విషాదాన్ని నింపిన సిక్కు పోలీస్ అధికారి సందీప్ సింగ్ ధాలివాల్ హత్య కేసులో నిందితుడిని న్యాయస్థానం దోషిగా తేల్చింది.నిందితుడు రాబర్ట్ సోలిస్ (50)ని దోషిగా తేలుస్తూ హ్యూస్టన్‌లోని హారిస్ కౌంటీ క్రిమినల్ కోర్టు జ్యూరీ ప్రకటన చేసింది.
సోమవారం ధాలీవాల్ కుటుంబ సభ్యుల ముందు కోర్టు హాలులో జ్యూరీ ఈ ప్రకటన వెలువరించింది.అంతకుముందు తన న్యాయవాదులను తొలగించిన సోలిస్.
కోర్టులో తనకు తానుగా వాదించుకుంటానని చెప్పాడు.
తన వాంగ్మూలంలో .సందీప్‌ను తాను కావాలని చంపలేదని, కాల్పులు అనుకోకుండా జరిగినట్లు తెలిపాడు.అయితే ప్రాసిక్యూటర్లు అతని వాదనను ఖండించారు.
హత్యకు గురైన సందీప్ సింగ్ బాడీ క్యామ్‌లోని వీడియోను జ్యూరీకి చూపించారు.నిందితుడు కారు నుంచి దూకడం, ట్రాఫిక్ మధ్య పరిగెత్తడం అందులో కనిపించింది.
ఈ క్రమంలోనే సోలిస్ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో సందీప్ సింగ్‌పై కాల్పులు జరిపాడు.ఈ హృదయ విదారకరమైన దృశ్యాలను చూసి జ్యూరీ సభ్యులు, ధాలివాల్ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు.
సోలిస్‌ను దోషిగా గుర్తించడానికి ముందు న్యాయమూర్తులు 25 నిమిషాల పాటు మంతనాలు జరిపారు.జస్టిస్ క్రిస్ మోర్టన్ తీర్పును చదువుతుండగా .సోలిస్‌లో ఎలాంటి భావోద్వేగం కనిపించలేదు.
కాగా… 2019 సెప్టెంబర్ 27న ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న సందీప్ సింగ్‌ను సోలిస్ తుపాకీతో కాల్చాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సందీప్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో హ్యూస్టన్‌లోని 315 అడిక్స్ హోవెల్ రోడ్డులో ఉన్న పోస్టాఫీసును ‘డిప్యూటీ సందీప్ సింగ్ ధాలివాల్ పోస్టాఫీస్ భవనం’గా పేరు మార్చి ఆయనను గౌరవించాలని అమెరికా భావించింది.
అందుకు సంబంధించిన బిల్లుపై నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది.తద్వారా అమెరికాలో భారత సంతతి వ్యక్తి పేరుతో ఉన్న రెండో పోస్టాఫీస్‌గా 315 అడిక్స్ హోవెల్ గుర్తింపు పొందింది.
వృత్తి పట్ల ధాలివాల్ అంకితభావం, త్యాగానికి గుర్తింపుగా అక్కడి ‘బెల్ట్‌వే 8 టోల్‌వే‘లో కొంత భాగానికి ఆయన పేరు పెట్టిన సంగతి తెలిసిందే.‘హెచ్‌సీఎస్ఓ డిప్యూటీ సందీప్ సింగ్ ధాలివాల్ మెమోరియల్ టోల్‌వే’గా దీనికి నామకరణం చేశారు.10వేలకు పైగా సిక్కులు ఉండే హారిస్ కౌంటీలో తలపాగా, గడ్డంతో విధులు నిర్వహించిన తొలి సిక్కు వ్యక్తిగా ధాలివాల్ వార్తల్లో నిలిచారు.2009లో అమెరికన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన ఆయన పదేళ్ల పాటు పలు హోదాల్లో కొనసాగారు.