జగన్ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ ఓ మాట అన్నారు.మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకుంటాం.
దీనికోసం కేంద్రం అనుమతి కూడా అవసరం లేదు.రాజధాని కోసం చంద్రబాబు సేకరించిన మొత్తం భూమిని తిరిగి రైతులకు ఇచ్చేస్తాం అన్నారు.
కానీ ఆచరణలో ఇది సాధ్యమేనా? చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు రైతుల నుంచి భూమిని సేకరించి, వాటిని అభివృద్ధి చేసి తిరిగి ప్లాట్ల రూపంలో వాళ్లకు ఇస్తామని హామీ ఇచ్చారు.సాధారణ భూముల కంటే ఇలా అభివృద్ధి చేసిన భూములకు అధిక ధర వస్తుందన్న ఉద్దేశంతో రైతులు ఏకంగా 33 వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చారు.
అయితే ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి మాత్రం అక్కడ రాజధాని ఉండదు.ఆ భూములు మాకు అవసరం లేదు.వాటిని తిరిగి ఇచ్చేస్తాం అంటున్నారు.మరి ఇన్నేళ్లు ఆ భూమిని ప్రభుత్వం దగ్గరే పెట్టుకున్నందుకు రైతులకు జరిగిన నష్టం మాటేమిటి? వాళ్లకు కౌలు చెల్లిస్తారా? అక్కడ ఇప్పటికే కట్టిన భవనాలను కూల్చేసి ఆ భూములను అలాగే రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది.మరి దానికి అయ్యే ఖర్చు సంగతేంటి?
అభివృద్ధి చెందిన ప్లాట్లు తమకొస్తాయని ఆశతో ఉన్న రైతులకు ఐదేళ్ల తర్వాత మళ్లీ వాళ్ల భూమిని వాళ్ల చేతిలో పెడతామంటే.దీనివల్ల వాళ్లకు కలిగిన నష్టం ఎంత? అసలు ఈ మాట పెద్దిరెడ్డి వ్యక్తిగత అభిప్రాయమా లేక కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయమా? పెద్దిరెడ్డి మాటే ప్రభుత్వం మాట కూడానా? ఒకవేళ అదే నిజమైతే రైతులకు పరిహారం ఇస్తారా?
అమరావతిని కట్టలేమంటూ మరో రెండు చోట్లకి పరిపాలనను వికేంద్రీకరిస్తున్న వాళ్లు.ఈ పరిహారం, ఆ రాజధానులు కట్టడానికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చంద్రబాబు ఇచ్చిన హామీకి మేము కట్టుబడి ఉండాలా అని మరో మంత్రి బొత్స ప్రశ్నిస్తున్నారు.మరి ప్రభుత్వం మారినప్పుడల్లా మీరు నిర్ణయాలు మార్చుకుంటూ వెళ్తే.
రాజధాని కోసం భూములిచ్చిన రైతుల మాటేమిటి? గత ప్రభుత్వంతో తమకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటం ఏమైనా సమంజసంగా ఉందా?