తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువవుతోంది.దీంతో రోజురోజుకి పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
ప్రధాన నగరాలతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది.ఉదయం, రాత్రి సమయాలలో చలి గాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
తెల్లవారుజాము సమయంలో రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.అదేవిధంగా చలి ప్రభావంతో సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఏపీలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.మినుములూరు కాఫీ బోర్డులో 10.02, పాడేరులో 13.05 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.ఇంకా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత, మంచిర్యాల జిల్లాలో 12.8, ఆదిలాబాద్ జిల్లాలో 13.1, నిర్మల్ జిల్లాలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.