జూన్ 21 నుంచి 24 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) అమెరికా పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే.ఇందుకోసం యావత్ ప్రపంచం, ఇరు దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు( Indian Americans ) మోడీ రాక నేపథ్యంలో ఆనందంలో మునిగిపోయారు.అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు చేరుకోనున్న మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మోడీ ఎయిర్ ఇండియా వన్ న్యూయార్క్‌లో( New York ) ల్యాండైన వెంటనే భారతీయ అమెరికన్ల బృందం ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది.మరో 600 మంది కమ్యూనిటీ సభ్యులు వాషింగ్టన్‌లోని వైట్కి సమీపంలోని విల్లార్డ్ ఇంటర్ కాంటినెంటల్( Willard Intercontinental ) (మోడీ బస చేయనున్న హోటల్) ఎదురుగా వున్న ఫ్రీడమ్ ప్లాజా వద్దకు వెళ్లాలని భావిస్తున్నారు.
అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమం నుంచి తూర్పు వరకు భారతదేశానికి చెందిన కళలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.ఈ మేరకు బీజేపీ – యూఎస్ఏ ఓవర్సీస్ ఫ్రెండ్స్ అధ్యక్షుడు అడపా ప్రసాద్( Adapa Prasad ) జాతీయ మీడియా సంస్థకు తెలిపారు.

మొత్తం 160 మంది కళాకారులతో 25 కార్యక్రమాలకు తాము ప్లాన్ చేసినట్లు ప్రసాద్ వెల్లడించారు.జూన్ 22న బైడెన్, జిల్ బైడెన్లు 21 గన్ సెల్యూట్‌తో మోడీకి స్వాగతం పలికే సమయంలో 7000 మందికి పైగా భారతీయ అమెరికన్లు వైట్‌హౌస్ సౌత్ లాన్లలో వుండాలని భావిస్తున్నారు.ఈ స్వాగత కార్యక్రమానికి హాజరయ్యే వారి రిజిస్ట్రేషన్‌ను ఇప్పటికే శ్వేతసౌధం ప్రారంభించింది.

ఇక యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మోడీ రెండవసారి ప్రసంగించనున్నారు.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించాల్సిందిగా అమెరికా చట్టసభ సభ్యులు మోడీకి ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.
అలాగే వాషింగ్టన్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్లో అమెరికాకు చెందిన అగ్రశ్రేణి కంపెనీల ఛైర్మన్ , సీఈవోలను ఉద్దేశించి కూడా మోడీ ప్రసంగిస్తారు.అదే రోజు సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ సెంటర్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడతారు.