పైకి అంతా ఐకమత్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నాము అనే భావన ప్రజల్లో కలుగజేస్తూనే, పార్టీ హైకమాండ్ వద్ద మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, తెలంగాణ బీజేపీ లో మాత్రం రెండు గ్రూపులు ఉన్నాయి అనేది బహిరంగ రహస్యం.ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం, తాము గొప్ప అంటే, తాము గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు తెలంగాణ బిజెపిలో నెలకొన్నాయి.
ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు గ్రూపులుగా ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన రహస్యమే.తాజాగా బండి సంజయ్ తెలంగాణ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
తన పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్ర అని పేరు కూడా డిసైడ్ చేసేసుకున్నారు.పాదయాత్ర కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది .అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తన యాత్రను 24వ తేదీకి మార్చుకోవాల్సి వచ్చింది.
ఈ పాదయాత్రను ఈనెల 24వ తేదీన పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు, ఈ పాదయాత్ర కమిటీ లో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు.అయితే బండి సంజయ్ పాదయాత్ర చేయాలనుకోవడం ఇప్పటి నిర్ణయం కాదు.
ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి తెలంగాణ అంతటా పాదయాత్ర చేపట్టి తన పట్టు నిలుపుకోవాలని చేస్తున్నారు.అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభించాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు.
మరో వైపు చూస్తే హుజురాబాద్ ఎన్నికల వేడి మొదలవ్వడం తదితర కారణాలతో సంజయ్ పాదయాత్ర పై అనేక అనుమానాలు నెలకొన్నాయి.

ఏదో ఒక కారణంతో పార్టీ హై కమాండ్ పై ఒత్తిడి పెంచి సంజయ్ పాదయాత్ర వాయిదా వేసేలా కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.పాదయాత్ర ద్వారా సంజయ్ క్రేజ్ పెరిగితే, రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బందులు అనే అనుమానంతో కిషన్ రెడ్డి అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పాదయాత్ర వ్యవహారంలో పడి అసలు హుజురాబాద్ ఉప ఎన్నికలపై ఈ ఇద్దరు కీలక నాయకులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనేది ఈటెల అనుచరులకు అసంతృప్తి రాజేస్తోంది.