అమ్మ అనే పదం అమృతం కన్న తీపిది అంటారు కవులు.కానీ నేటి కాలంలో కన్న పేగు, కడుపున పుట్టిన వారికి భారం అవుతుంది.
అమ్మ అంటే విషపు పురుగులా చూస్తున్నారు కసాయి ఆ కొడుకులు.పిల్లలు పుట్టినప్పటి నుండి పెళ్లి చేసుకునే వరకు కన్న పిల్లల కోసం తల్లి పడే వేదన కొంచెం అయినా జ్ఞాపకానికి రావడం లేదు కొడుకులని చెప్పుకుంటున్న బండరాళ్లకు.
ఇకపోతే కరోనా బారిన పడ్ద ఓ తల్లి అందరు ఉండి కూడా అనాధగా మరణించిన విషాద ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో చోటు చేసుకుంది.ఈ మహిళకు కరోనా సోకడంతో పేగు తెంచుకున్న కొడుకులు దరికి రానివ్వలేదు.
ఇంటి యజమాని వెల్లగొట్టాడు.దీంతో ఆ తల్లికి తల దాచుకోవడానికి చోటు దొరకక పాత వ్యవసాయ మార్కెట్లో జాగారం చేసింది.
అక్కడి వ్యాపారులు వెల్లగొట్టడంతో ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న తోపుడు బండే దిక్కయింది.అక్కడ్ నిస్సహాయ స్థితిలో పడుకొని ఉండగా మానవత్వం ఉన్న ఓ వ్యక్తి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారట.
వెంటనే స్పందించిన వారు ఆ మహిళను అంబులెన్సులో కరీంనగర్ ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు.కాగా నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఆ మహిళ మృతి చెందడం విషాదకరం.
మేధావులు నివసిస్తున్న ఈ సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు.