నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లతో అడ్మిషన్లు సంపాదించిన 700 మంది భారతీయ విద్యార్ధులను( Indian Students ) దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ( Canada ) ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం ఇరు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది.
భారత్, కెనడాలకు చెందిన రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడ్డాయి.ఈ ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల బహిష్కరణ ప్రక్రియను కెనడా ప్రభుత్వం నిలిపివేసింది.
అంతేకాదు.భారతీయ విద్యార్ధులకు తాత్కాలిక అనుమతులను కూడా జారీ చేస్తామని తెలిపింది.
వీసా మోసంపై విచారణను ప్రారంభించి, దేశంలోనే వుండేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది.
అయితే కెనడియన్ కాలేజీ అడ్మిషన్ లెటర్‌ల కుంభకోణంలో ప్రమేయం వుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ బ్రిజేష్ మిశ్రా( Brijesh Mishra ) కెనడాలో పట్టుబడటంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.పంబాబ్‌లోని జలంధర్ నగరంలో ఈఎంఎస్ఏ అనే ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీని నిర్వహిస్తున్న మిశ్రా.నకిలీ అడ్మిషన్ లెటర్ కుంభకోణం వెలుగులోకి రాకముందే అదృశ్యమయ్యాడు.
అతను, మరికొందరి కారణంగా పంజాబ్ , భారత్‌లోని ఇతర రాష్ట్రాలకు చెందిన వందలాది మంది విద్యార్ధులు బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు.
కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ( Canada Border Services Agency ) శుక్రవారం మిశ్రాను అరెస్ట్ చేసింది.లైసెన్స్ లేకుండా ఇమ్మిగ్రేషన్ సేవలను అందించడం, అధికారులకు తప్పుదు సమాచారం ఇవ్వడం వంటి అభియోగాలను ఇతనిపై మోపింది.అలాగే కెనడా విద్యాసంస్థలలో ప్రవేశం కోసం భారతీయ విద్యార్ధులకు నకిలీ అడ్మిషన్ లెటర్స్ అందజేయడంలో అతని పాత్రకు సంబంధించి శుక్రవారం అధికారికంగా అభియోగాలు నమోదు చేశారు.
బ్రిజేష్ మిశ్రా ప్రస్తుతం బ్రిటీష్ కొలంబియా నిర్బంధంలో వున్నాడు.అతనిని కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ నుంచి బ్రిటీష్ కొలంబియాలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించారు.ఈ నేపథ్యంలో మిశ్రాతో పాటు కొందరు ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు తమను మోసం చేశారని , తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్ధులు కోరుతున్నారు.