తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) బలం రోజు రోజుకు పెరుగుతుందనే సంకేతాలతో, వచ్చే ఎన్నికలపై ఆ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.ముఖ్యంగా పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
కచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది.ఈ మేరకు నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థులను గుర్తించే పనిలో ఉంది.
దీనికి తోడు తెలంగాణ కాంగ్రెస్ కు వ్యూహకర్త గా పనిచేస్తున్న సునీల్ కానుగోలు సూచనలతో ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల ( Karnataka )తర్వాత , తెలంగాణ కాంగ్రెస్ లో సమూల మార్పులు కనిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై కాంగ్రెస్ చేయించిన సర్వేలో కాంగ్రెస్ కు అధికారం దక్కబోతుందని తేలడంతో ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ ఉండడంతో ,ఎన్నికల ఫలితాలు తర్వాత బీఆర్ఎస్( BRS party ) తమ పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి చేర్చుకుంటే తాము తీవ్రంగా నష్టపోవాలనే విషయాన్ని గుర్తించింది.అందుకే ఈసారి టిక్కెట్లు ఇచ్చే విషయంలో కొన్ని కండిషన్లు పట్టాలని నిర్ణయించుకుంది.
ఈ ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘ పార్టీ మారను.పార్టీ మారాల్సి వస్తే రాజీనామా చేస్తా’ అని టికెట్ ఇచ్చే ముందు సదరు నాయకులు నుంచి పేపర్ మీద సంతకం తీసుకోవాలని నిర్ణయించారు.ఈ మేరకు న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని, ఆ బాండ్ పేపర్ మీద పార్టీకి నష్టం జరగకుండా అనేక షరతులను విధించారు.పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు టికెట్ పొందబోతున్న నాయకులు బి ఫామ్ తీసుకునే ముందు ఆ బాండ్ పై సంతకం చేయాల్సి ఉంటుంది.
ఈ విధానానికి కాంగ్రెస్ హై కమాండ్ కూడా అంగీకారం తెలిపినట్లు ఏఐసిసికి చెందిన కీలక నాయకుడు ఒకరు తెలిపారు .గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ బాండ్ పేపర్ విధానాన్ని అమలు చేసింది.కానీ ఆ ఎన్నికల్లో ఇద్దరు మాత్రమే గెలవడం, గెలిచిన ఇద్దరూ కాంగ్రెస్ వీర విధేయులు కావడంతో , ఇప్పటి వరకు ఆ బాండ్ పేపర్ అవసరం రాలేదు.అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత, ఆ విధమైన పరిస్థితి ఉండదని, కచ్చితంగా కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుక్కునే ప్రయత్నం చేస్తుందని, అందుకే ఈ బాండ్ పేపర్ విధానాన్ని అమల్లోకి చేస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు .
ఈ బాండ్ల వ్యవహారాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా లీగల్ సెల్ ను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడం , అలాగే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకోవడం వంటి సంఘటనలను గుర్తు చేసుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ బాండు విధానాన్ని అమల్లోకి తీసుకువస్తుంది.