సూర్యాపేట జిల్లా:హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలానికి చెందిన లకావత్ రామారావు (లేటు) కుమార్తె లావణ్యకు చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉండేది.అందుకు అనుగుణంగా కష్టపడి చదివి మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది.
యు.పి.ఎస్.సి.పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కోసం కోచింగ్ తీసుకోవాలనుకుంది.అయితే తండ్రి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఐఏఎస్ కావాలన్న తన కోరిక తీరదని భావించింది.
అయితే లావణ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వర్క్ కాగ్,మైక్ టీవీ కంపెనీ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి ఆమెకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.ఆమె కోచింగ్ ఫీజులు భరించేందుకు సిద్ధమయ్యారు.
కార్పోరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్)కింద ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని లావణ్యకు అందించారు.ఈ సందర్భంగా లావణ్యతో ఆయన శనివారం వీడియో కాల్ లో మాట్లాడారు.
బాగా చదవుకుని మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుతూ,అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి తనవంతు సహాయం ఎల్లప్పుడూ చేస్తానని అప్పిరెడ్డి చెప్పారు.
ఆ తరువాత లావణ్యతో బిగ్ బాస్ ఫేమ్,హీరో సోహైల్ మాట్లాడారు.ఐఏఎస్ అయ్యి తెలంగాణకు పేరు తేవాలన్నారు.
తనకు ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రోత్సహించిన అప్పిరెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటానని విద్యార్థిని లకావత్ లావణ్య చెప్పారు.ఈ కార్యక్రమంలో చక్రధర్,శ్రీనివాస్ రెడ్డి,రవి సజ్జల, చరిత్ జూలూరి తదితరులు పాల్గొన్నారు.