జగన్ తీరుపై వైసిపి నాయకుల లోను కాస్త అసంతృప్తి పెరిగిందనే విషయం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలక పదవులు ఆశించి భంగపడిన వారు రాబోయే ఎన్నికల్లో పార్టీ మారాలని ఆలోచనతో ఉన్నట్లు గా నిఘా వర్గాల నివేదికలో తేలింది.
ఈ వ్యవహారం ఇలా ఉండగానే మాజీ మంత్రి , ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డి తెలుగుదేశం పార్టీ మహానాడు లో లోకేష్ తో బేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.ఉదయం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన ఆనం కుమార్తె కైవల్య రెడ్డి లోకేష్ తో ప్రత్యేకంగా భేటీ అయి అనేక రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఈ మేరకు ఆమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి టిడిపి తరఫున పోటీ చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని లోకేష్ ను కోరినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రతిపాదనకు లోకేష్ ఓకే చెప్పగానే టిడిపిలో చేరాలని కైవల్య రెడ్డి నిర్ణయించుకున్నారట.అంతేకాకుండా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టిడిపి నాయకురాలు విజయమ్మ కు కైవల్య రెడ్డి కోడలు కావడం, ఆమె ప్రస్తుతం టిడిపిలోనే ఉండడంతో కైవల్య రెడ్డిని టిడిపిలో చేర్చాలని చాలా రోజులుగా ఆమె భావిస్తున్నారట .అయితే త్వరలోనే ఆత్మకూరు ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేసేందుకు కైవల్య రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారట.ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్నారు.రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు తప్పకుండా జగన్ అవకాశం కల్పిస్తారని రాంనారాయణరెడ్డి భావించారు.
కానీ అదే సామాజిక వర్గం ,అదే జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి జగన్ మంత్రి పదవి ఇవ్వడంతో, అప్పటి నుంచి ఆనం రాంనారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్నారట.ఈ నేపథ్యంలోనే లోకేష్ తో కైవల్య రెడ్డి భేటీ కావడం వైసిపి లోను సంచలనం రేపింది.
ఈ మేరకు ఆనం రామనారాయణ రెడ్డికి వైసీపీ కీలక నేతల నుంచి ఫోన్ లు వెళ్లినట్టు సమాచారం.