ఎన్ఆర్ఐలు, వలస కార్మికులకు( NRIs , migrant workers ) రిమోట్ ఓటింగ్ విధానాలు, ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయోమెట్రిక్ వంటి అంశాలకు సంబంధించి భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ ( Rajeev Kumar )కీలక వ్యాఖ్యలు చేశారు.ఫిబ్రవరి 18తో ఆయన పదవీకాలం ముగియనుంది.
దీంతో కొత్త సీఈసీగా సీనియర్ ఐఏఎస్ జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు.ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ), సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా( Justice Sanjeev Khanna ), కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ), ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీలు సభ్యులుగా ఉన్న అత్యున్నత స్థాయి కమిటీ ఈ మేరకు జ్ఞానేష్ కుమార్ పేరును తదుపరి సీఈసీగా ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.
ఆమె దీనికి ఆమోదముద్ర వేశారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ దేశంలో ఎన్నికల సంస్కరణలు, ఎన్ఆర్ఐ ఓటింగ్ వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.ఎన్నికల ఖర్చులు, ప్రచార వాగ్థానాల నిర్వహణలో ఆర్ధిక పారదర్శకత అవసరాన్ని, సోషల్ మీడియా ద్వారా వ్యాపించే నకిలీ కథనాలపై చర్యలు తీసుకోవాలని కుమార్ సూచించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రవాస భారతీయులు దేశానికి వెలుపలి నుంచి ఓటు వేయడానికి ఇది సరైన సమయమన్నారు.ఎన్నికల సంఘం దీని కోసం యంత్రాంగాన్ని అభివృద్ధి చేసిందని , కేంద్రం ఆమోదముద్ర వేయడమే తరువాయి అని రాజీవ్ కుమార్ తెలిపారు.

ప్రస్తుత చట్టాల ప్రకారం విద్య, వ్యాపారం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ పౌరులు దేశంలో ఓటు వేయడానికి అర్హులు.కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భౌతికంగా హాజరు కావాల్సి ఉంది.దీని కోసం వారు తామున్న దేశం నుంచి స్వదేశానికి రావాల్సి ఉంటుంది.ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ప్రతిపాదనల ప్రకారం ఎన్ఆర్ఐలు పోస్ట్ ద్వారా, భారత రాయబార కార్యాలయాలలో ఆన్‌లైన్ ఓటింగ్‌లో పాల్గొనడం వంటివి ఉన్నాయి.
అయితే వీటిపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలియజేస్తూ ఉండటంతో అడుగు ముందుకు పడటం లేదు.అంచనాల ప్రకారం దాదాపు లక్షమందికి పైగా ప్రవాస భారతీయులు ఓటు వేసేందుకు రిజిస్టర్ చేసుకున్నారు.
వీరిలో 25 వేల మంది 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి భారతదేశానికి వచ్చారు.