హెచ్-1బీ వీసా.అమెరికా కల నెరవేర్చుకునే క్రమంలో ఒక కీలక మజిలి.
ఇది లభిస్తే చాలు దీని ఆధారంగా గ్రీన్‌కార్డును సైతం సొంతం చేసుకుని శాశ్వతంగా అగ్రరాజ్యంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం.కానీ ఈ హెచ్ 1 బీ వీసా పొందడం అంత అషామాషీ కాదు.
అమెరికాపై అన్ని దేశాలకు మోజు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ ఎక్కువైంది.దీంతో వీసాల జారీ అమెరికాకు కత్తి మీద సాములా తయారైంది.
ఈ విషయంలో తమకు కోటా పెంచాలంటూ భారత్, చైనా సహా ఎన్నో దేశాలు అగ్రరాజ్యం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి.ఇటు స్థానికులకు అన్యాయం జరుగుతుందని హెచ్ 1 బీ వీసాల జారీని కఠినతరం చేయాలని స్వదేశంలో కొన్ని పక్షాల ఆందోళనలు సైతం ఫెడరల్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.
ఈ నేపథ్యంలో హెచ్ 1 బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా శుభవార్త చెప్పింది.హెచ్-1బీ వీసా కోసం త్వరలోనే రెండో విడత లాటరీ ప్రక్రియను చేపట్టనున్నట్లు అమెరికా వెల్లడించింది.ఈ నిర్ణయంతో ఇటీవల చేపట్టిన ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్లో ఎంపిక కానివారికి ఇది ఊరట కలిగించే వార్తగా చెప్పుకోవచ్చు.డిజిటల్ పద్దతిలో చేపట్టిన మొదటి విడత డ్రాలో కావాల్సినంత మందికి వీసాలు ఇవ్వలేకపోయినందున రెండోసారి ఈ లాటరీని నిర్వహించాలని భావిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది.2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా అవసరాలకు అనుగుణంగా మరిన్ని రిజిస్ట్రేషన్లు అవసరం ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్సీఐఎస్ పేర్కొంది.గతంలో వచ్చిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను జులై 28న ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్లో ఎంపిక చేసినట్లు ఏజెన్సీ తెలిపింది.
ఈ అభ్యర్థులకు తమ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు అవకాశం ఇచ్చినట్లు చెప్పింది.అయితే, హెచ్-1బీ పిటిషన్లను ఆన్లైన్లో ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
కాగా, ఏటా హెచ్-1 బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.
వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.
అయితే హెచ్-1బీ వీసాల జారీలో దశాబ్ధాలుగా అమలు చేస్తున్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.గరిష్ఠ వేతన స్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు ఇచ్చేలా కీలక సవరణ చేశారు.
దీనికి అనుగుణంగా హెచ్-1 బీ ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐసీ) జనవరి 7న తుది ప్రకటన కూడా చేసింది.దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 9 నుంచి కొత్త ఎంపిక విధానం అమల్లోకి రావాల్సి ఉంది.
![Telugu Hb Visas, Electronic, Visa, Visarare, Mathematics, Science, Citizenship-T Telugu Hb Visas, Electronic, Visa, Visarare, Mathematics, Science, Citizenship-T](https://telugustop.com/wp-content/uploads/2021/07/US-Citizenship-and-Immigration-Services.jpg )
అయితే కొత్త విధానానికి అనుగుణంగా హెచ్-1బీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాల్సి ఉన్నందున కాస్త సమయం పట్టే అవకాశం వుంది.అందువల్ల నూతన విధానాన్ని డిసెంబరు 31 వరకు వాయిదా వేస్తున్నట్లు బైడెన్ యంత్రాంగం తెలిపిన సంగతి విదితమే.అప్పటివరకు పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.
.