నల్లగొండ జిల్లా:వేసవి కాలం దృష్ట్యా విద్యాశాఖ విద్యా సంస్థలకు ఒంటిపూట బడులు ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో పిల్లలంతా పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం కల్లా ఇంటికి చేరుకుంటారు.
ఇంత వరకు బాగానే ఉంది.మధ్యాహ్నం నుండి పిల్లలు ఎక్కడ ఉంటారనేదే అసలు సమస్యగా మారుతుంది.
చాలా మంది తల్లిదండ్రులు వివిధ వృత్తిపరమైన పనులకు వెళ్తుంటారు.ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండలేక సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలసి తిరుగుతుంటారు.
వారికి వేసవి తాపం యొక్క ప్రతాపం తెలియకుండా ఎండలో తిరగడం వల్ల వడ దెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది.మరి కొంతమంది పిల్లలు స్నేహితులతో కలసి ఈత కోసం బావుల,చెరువుల వద్దకు వెళ్తుంటారు.
ఈసమయంలో వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.ఇంకొంతమంది ఇళ్లలో ఉండే ద్విచక్ర వాహనాలపై తిరిగేందుకు ప్రయత్నం చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు.
కొందరైతే ఇళ్లల్లో మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి వాటికి బానిసలుగా మారే ప్రమాదం కూడా ఉంది.అందుకే తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లలను తల్లిదండ్రులు ఎల్లవేళలా గమనిస్తూ ఉండాలని,పాఠశాల నుంచి వచ్చాక ఇంట్లోనే ఉంటూ చదువుకునేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు.