గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో బ్రదర్ అనిల్ కుమార్ కలకలం సృష్టిస్తున్నారు.జగన్ సోదరి భర్త అయిన అనిల్ కుమార్ బిసి ,ఎస్సీ క్రిస్టియన్ సంఘాలతో తరచుగా భేటీ అవుతూ అనేక రాజకీయ అంశాలపై చర్చిస్తున్నారు.
కొత్త పార్టీ పెట్టే ఆలోచన తోనే బ్రదర్ అనిల్ కుమార్ ఈ విధంగా రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.ఇప్పటికే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించారు .ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్నారు.2024 ఎన్నికల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు షర్మిల గట్టిగానే అక్కడి అధికార పార్టీ టీఆర్ఎస్ పై పోరాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు కష్టపడుతున్నారు.అయినా అక్కడి రాజకీయ వ్యవహారాల పై దృష్టి సారించకుండా, ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ఆయన వ్యవహారాలు చేపట్టడం , పరోక్షంగా ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఉండడం ఇవన్నీ రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

అంతేకాదు ఏపీకి బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నాను అంటూ బ్రదర్ అనిల్ కుమార్ పదే పదే ప్రస్తావిస్తున్నారు.జగన్ షర్మిల ల మధ్య విభేదాలు తలెత్తాయని, గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో , బ్రదర్ అనిల్ కుమార్ ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోన్న తీరు ప్రాధాన్యం సంతరించుకుంది.ఆయన రాజకీయ వ్యవహారాలు ఇప్పుడిప్పుడే ఏపీలో మొదలుపెట్టడంతో.
వాటిని అడ్డుకునేందుకు వైసీపీ రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది.ఈ మేరకు బ్రదర్ అనిల్ కుమార్ పై ఏపీ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ యలమంచిలి ప్రవీణ్ సంచలన విమర్శలు చేశారు.
అసలు బ్రదర్ అనిల్ కుమార్ కు ఏపీ రాజకీయాలతో ఏం సంబంధం ఉందని ప్రవీణ్ ప్రశ్నించారు.ఒక మత ప్రబోధకుడుగా ఉన్న ఆయన రాజకీయ నాయకుడిగా ఎప్పుడు అవతారం ఎత్తారో చెప్పాలంటూ ప్రవీణ్ ప్రశ్నించారు.
రాజకీయాలపై బ్రదర్ అనిల్ కు ఆసక్తిగా ఉంటే తెలంగాణలో రాజకీయ పార్టీ పనులు చూసుకోవాలని, ఏపీ రాజకీయాల్లో తలదూర్చ వద్దంటూ వినతి తో కూడిన వార్నింగ్ ఇచ్చారు.అంతేకాదు అగ్రకులానికి చెందిన అనిల్ కుమార్ బిసి ఎస్టీ, ఎస్సీలను ఉద్దరిస్తాను అని చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ ఆయన అన్నారు.
ప్రస్తుతం బ్రదర్ అనిల్ కుమార్ కదలికలపై వైసిపి పూర్తిగా దృష్టి పెట్టింది.ఆయన ఎప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు ? ఏ అంశాలపై చర్చిస్తున్నారు అనే విషయాలను ఆరా తీస్తున్నారట.
.