ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత వైసిపి ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిన నేతలతో పాటు, జగన్( Jagan Mohan Reddy ) కు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన వారిని టార్గెట్ చేసుకుంటూ, వారి అవినీతి వ్యవహారాలను బయటపెడుతూ విచారణలు, అరెస్టులు చేయించే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది వైసిపి కీలక నేతలు , మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు అరెస్టు కాగా, మరి కొంత మంది విచారణను ఎదుర్కొంటున్నారు.
ఈ జాబితాలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వల పై ఫోకస్ పెట్టింది .ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైనే ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి.ఈ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ కౌంటర్ ఎటాక్ కు దిగారు .ఈ మేరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు.
వారం రోజుల క్రితం కలెక్టర్ , ఎస్పీకి ద్వారంపూడి( Dwarampudi Chandrashekhar Reddy, ) పై ఎమ్మెల్యే కొండబాబు ఫిర్యాదు చేయడమే కాకుండా అవినీతిపై విచారణ చేయించాలని కోరుతూ చంద్రబాబు( Chandrababu naidu )ను కలిసేందుకు ఎమ్మెల్యే కొండబాబు సిద్ధమయ్యారు. తాజా పరిణామాలపై స్పందించిన ద్వారంపూడి కక్ష సాధింపు చర్యలు, నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని , ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరించడం సరికాదని, చట్టబద్ధంగా కేసులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను ఎటువంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని, మీ వల్ల 30 వేలమంది కార్మికులు నష్టపోతున్నారని దారంపూడి లేఖలో ప్రస్తావించారు. అధికారుల బదిలీలలో ఎంత అవినీతి జరిగిందో త్వరలోనే బయట పెడతాను అని, ఆరు నెలల తరువాత అవినీతి అక్రమాలపై స్పందిస్తానని ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు.