రాజకీయ ప్రత్యర్థులకే కాదు, సొంత పార్టీ నేతలకు సైతం జగన్ రాజకీయ వ్యూహాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ మరింతగా తన వ్యూహాలకు పదును పెట్టారు.
అసలు జగన్ నిర్ణయాలు ఆయనకు అత్యంత సన్నిహితులకు కూడా అర్ధం కావడంలేదు.ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ బాగా ఆరితేరిపోయారు.
అసలు రాజకీయ పార్టీలు అంటే, డబ్బు పలుకుబడి కలిగిన నాయకులకు పెద్దపీట వేస్తారు అనే అపోహ నుంచి జనాలను బయటపడేసేందుకు, తాను అందరిలాంటి వ్యక్తిని కాదు అని నిరూపించుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.పార్టీలో ఎంతోమంది ఆర్థిక స్థితిమంతులు ఉన్నా, వారికి అర్హతలను బట్టి పదవులు ఇస్తే కోట్లాది రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, జగన్ మాత్రం ఎవరిని పట్టించుకోవడంలేదు.
అసలు ఊరు పేరు లేని సామాన్యులను ఎంపిక చేసుకుని వారికి కీలకమైన పదవులు ఇస్తూ, జగన్ సరికొత్త రాజకీయానికి తెరలేపారు.ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్, మేయర్ల ఎంపిక చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసిన మంత్రి పదవుల విషయంలోనూ చాలా వరకు జగన్ ఈ విధానాన్ని పాటించారు.దీనికి కారణం విధేయతే అనే విషయం అర్థం అవుతోంది.
పార్టీ పదవుల్లోనూ, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను చాలామంది వీర విధేయులకు జగన్ కట్టబెట్టారు.అయితే గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా నాయకులు చాలామంది టిడిపి వైపు వెళ్లిపోయారు.
దాదాపుగా వీరంతా ఆర్థికంగా స్థితిమంతులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారే.

ఇక ప్రస్తుతం వైసీపీలో వివిధ పదవులు ఆశిస్తున్న వారు ఆర్థికంగా స్థితిమంతులు, రాజకీయ ఉద్దండులు ఉన్నా, వారు ఎవరినీ కాదు అని జగన్ విధేయతకే పట్టం కట్టి మరీ అతి సామాన్యులనే ఎంపిక చేసుకున్నారు.కొత్త కొత్త వారికి పదవులు ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యం పెంచడం ద్వారా వారు వైసీపీ ని గుండెల్లో పెట్టుకుంటారని, పార్టీ మారడం, వెన్నుపోటు పొడవడం వంటి వ్యవహారాలకు దూరంగా ఉంటారని, పార్టీ కోసం పని చేస్తారని జగన్ లెక్కలు వేసుకుని ఈ ఫార్ములాను ఉపయోగించినట్టు అర్థమవుతోంది.