కంటికి కనిపించని ఓ వైరస్ మహమ్మారి తో ప్రపంచమంతా యుద్ధం చేస్తోంది.ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది స్పష్టంగా తెలియకపోయినా, యుద్ధం అయితే నిరంతరంగా కొనసాగుతోంది.
ఈ ప్రభావం కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతున్నారు. ఏపీ విషయానికి వస్తే మొదట్లో ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నా, ఆ తరువాత తరువాత పెరుగుతూ వస్తున్నాయి.
ముఖ్యంగా ఢిల్లీ మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా ఈ వైరస్ మహమ్మారి ఏపీలో విస్తరిస్తోంది.దీని కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం గట్టిగానే కృషి చేస్తోంది.
ఒకవైపు లాక్ డౌన్ నిబంధనలు సమర్థవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు కరోనా కట్టడి కోసం నిరంతరంగా సర్వేలు చేయిస్తోంది.వాలంటీర్లు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నారు.
కేవలం ఒక్కసారి సర్వేతో మాత్రమే సరిపెట్టకుండా, ప్రతి ఇంటిని నిర్ణీత వ్యవధిలో రెండుసార్లు సర్వేలు చేస్తున్నారు.దీని ద్వారా పాజిటివ్ ఉన్న వారిని సులభంగా గుర్తిస్తారు.ఎవరికైనా కొత్తగా కరోనా లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్ సెంటర్ కు తరలిస్తున్నారు.ఏపీలో ఇప్పటివరకు మొదటి, రెండు కుటుంబ సర్వే లు జరిగాయి.
దీనిపై ఏపీ సీఎం జగన్ కూడా ఆరా తీశారు.ఇక మూడోసారి జరుగుతున్న సర్వే వివరాలను జగన్ కు అధికారులు అందించారు.
భారతీయ వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాల ప్రకారం మరో రెండు కేటగిరీల ను చేర్చి సర్వే చేస్తున్నామని సీఎంకు అధికారులు తెలియజేశారు.ఈ సర్వేల ద్వారా సమగ్రమైన వివరాలు ప్రాథమికంగా రాబట్టగలిగితే ప్రతి కుటుంబంలోని సభ్యులు ఆరోగ్య పరిస్థితులపై సర్వే చేసి వివరాలను నమోదు చేస్తారు.

ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను నమోదు చేయడం ద్వారా కరోనా బాధితులు కాంటాక్ట్ సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుందని, దీని ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అని, లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి క్వరంటెన్ కు పంపించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.మొదటి, రెండు సర్వేలు ద్వారా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించారు.అలాగే ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్న వారు ఇలా అందరి వివరాలను సమగ్రంగా సర్వే ద్వారా రాబట్టగలుగుతోంది.అన్ని వివరాలు పక్కగా అందితే కరోనా వైరస్ ప్రభావం నుంచి ఏపీని బయటపడేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.