కోర్టుల వ్యవహారంలో మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పడుతూ వస్తోంది.జగన్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ సంచలనంగా మారడంతో పాటు, వివాదాస్పదం అవుతుండడం, చివరకు కోర్టుల్లో అవి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తూ ఉండడం, ఇలా అనేక కారణాలతో మొదటి నుంచి ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పడుతూనే ఉంది.
తాజాగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఏపీ ప్రభుత్వం ఇకపై జారీ చేసే జీవో లన్నింటిని ఆన్లైన్ లో ఉంచకూడదని, ఆఫ్ లైన్ పద్ధతిలోనే ఉంచాలని జగన్ నిర్ణయం తీసుకోవడంతో, ఈ వ్యవహారంలో మళ్ళీ ప్రభుత్వానికి తలనొప్పులు తప్పేలా కనిపించడం లేదు.
ఇదే రకమైన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం, ఆఫ్ లైన్ లోనే జీవోలను ఉంచుతూ, ఆన్లైన్ లో వాటిని పెట్టకపోవడం పై తెలంగాణ కు చెందిన ఓవ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు 24 గంటల్లోగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలు అన్నిటిని వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో ఏపీలోనూ ఎవరైనా జగన్ నిర్ణయంపై కోర్టుకు వెళితే, ఇదే రకమైన తీర్పు వెలువడుతుందని, అప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ, ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ఆ జీవోలను ప్రభుత్వాలు రహస్యంగా ఉంచకూడదు.

ఇదే విషయాన్ని కేంద్రం కూడా అనేకసార్లు ఆదేశాలు ఇచ్చింది.ఈ మేరకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశారు.అలాగే అనేక న్యాయస్థానాలు దీనిపై తీర్పు ఇచ్చాయి.
ఇప్పుడు తెలంగాణలో తీర్పును ప్రస్తావిస్తూ, దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే జగన్ కు మళ్ళీ కోర్టు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ తరహా జీవోలను జారీ చేసింది.
అయితే అప్పట్లో దీనిపై వైసీపీ తప్పుబడుతూ విమర్శలు చేసింది.ఇప్పుడు జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడంతో కోర్టులో ఈ వ్యవహారం పై పరాభవం తప్పదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
.