ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటల తరువాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రానున్నారు.
అయితే చంద్రబాబుకు కేసు మెరిట్స్ మీద కాకుండా అనారోగ్యం కారణాల వలనే న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
దీంతో సుమారు 52 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ కుంభకోణంలో దాదాపు రూ.374 కోట్లను దోచుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో ఆయన దాదాపు 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
దాంతోపాటు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు మద్యం కేసులో అక్రమ అనుమతులు ఇచ్చిన కేసులో చంద్రబాబు కీలక సూత్రధారని సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.తిరిగి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆయన తిరిగి సరెండర్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే బెయిల్ మంజూరు నేపథ్యంలో పలు షరతులు విధించింది న్యాయస్థానం.
ఇందులో భాగంగా చంద్రబాబు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్న ఏపీ హైకోర్టు కేసుకు సంబంధించిన విషయాలను ఎక్కడా మాట్లాడకూడదని తెలిపింది.
కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని చెప్పింది.కేవలం ఆరోగ్య కారణాల కారణంగానే మంజూరు చేసిన బెయిల్ కావున ఆయన ఇల్లు, ఆస్పత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు తనకు ఇష్టమొచ్చిన ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వెసులుబాటు కల్పించింది ఏపీ హైకోర్టు.అయితే ఆయన ఎక్కడ, ఏ వైద్యం తీసుకున్నది తెలియజేస్తూ సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.
కేసుతో సంబంధం ఉన్న వారితో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రభావితం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.అయితే దీనిపై చంద్రబాబుకు ఇద్దరు డీఎస్పీలతో ఎస్కార్ట్ ఉంచాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరగా అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది.
అలాగే జెడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని తెలిపింది.చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని స్పష్టం చేసింది.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదంటూ టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే.ముందుగా ప్రాణాహాని అని, సెక్యూరిటీ సరిగా లేదన్న ఆరోపణలు చేసిన టీడీపీ శ్రేణులు తరువాత చంద్రబాబుకు చర్మ సమస్యలు ఉన్నాయని పేర్కొంది.
ఇటీవలే కంటి సమస్యతో బాధపడుతున్నారని దాంతోపాటు బీపీ, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని చెబుతూ కేవలం ప్రజల దృష్టిని మరల్చి వారి సానుభూతి కోసం ప్రయత్నించిందని వార్తలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.
అంతేకాదు ప్రభుత్వంపై సైతం అసత్య ఆరోపణలు చేసింది టీడీపీ.
కానీ చంద్రబాబు విషయంలో వైసీపీ సర్కార్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని తెలుస్తోంది.అంతేకాదు ఆయన చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో ఎక్కడా లేని విధంగా జైలులో ఏసీని సైతం ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలోనే చంద్రబాబు అనారోగ్యం అంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.అయితే ఈ మధ్యంతర బెయిల్ కేసు మెరిట్స్ మీద కాదని, కేవలం అనారోగ్యం దృష్ట్యా ఇచ్చిందని స్పష్టం అయింది.