వైసీపీ ప్రభుత్వంలో రెండు నెలల క్రితం సీఎం జగన్ చేపట్టిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో పలువురు కొత్త వారికి అవకాశం దక్కింది.ఈ జాబితాలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కూడా ఉన్నారు.
ఆయన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు.అయితే టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి పోటీగా వైసీపీ సామాజిక న్యాయభేరి అంటూ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
వైసీపీ బస్సు యాత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున కూడా బస్సు యాత్రలో భాగస్వామ్యం అవుతున్నారు.తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు.ఏపీ సీఎం జగన్‌ను అడ్డు తొలగించుకునేందుకు భారీ కుట్ర జరుగుతోందని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు.
సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన అడ్డు తొలగించుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని విమర్శలు చేశారు.

సీఎం జగన్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తానని మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తోందని మంత్రి మేరుగ నాగార్జున అభిప్రాయపడ్డారు.గతంలో కూడా సీఎం జగన్‌ను ఉద్దేశించి గాల్లో వచ్చినవాడు గాల్లోనే పోతాడని చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యానించారని ఆయన గుర్తుచేశారు.జగన్‌ను కాపాడుకునేందుకు ప్రతి వైసీపీ కార్యకర్త సైనికుడిలా సిద్ధంగా ఉండాలని కోరారు.
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ వెంట్రుక కూడా పీకలేరని మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఐకమత్యంగా ఉండి పార్టీకి, అధినేతకు అండగా నిలవాలని మంత్రి మేరుగ నాగార్జున కోరారు.కాగా మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.చంద్రబాబు అన్న మాటలను ఆయన వక్రీకరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి ఏపీ నుంచి తరిమేస్తానన్నది చంద్రబాబు ఉద్దేశమని.అంతేకానీ వైసీపీ నేతలు తమకు అలవాటైన హత్యా రాజకీయాలను తమకు అంటగట్టాలని చూస్తున్నారని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.