మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది.జనవరిలో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
సినిమా విడుదల గురించి పట్టింపు లేకుండా చిరంజీవి తదుపరి సినిమాను మొదలు పెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాడు.మొన్నటి వరకు చిరంజీవి వేదాళం సినిమాను తన తదుపరి సినిమాగా రీమేక్ చేసే అవకాశం ఉందన్నారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వేదాళం కంటే ముందుగానే లూసీఫర్ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.లూసీఫర్ రీమేక్ కోసం ముందు సుజీత్ మూడు నాలుగు నెలలు కష్టపడ్డాడు.
ఆ తర్వాత వివి వినాయక్ స్క్రిప్ట్ వర్క్ చేశాడు.ఆయన కూడా తప్పుకోవడంతో ఇప్పుడు మోహన రాజ దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ ను చేయాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యాడు.
తమిళంలో స్టార్ డైరెక్టర్ గా పేరున్న మోహనరాజ గతంలో చిరంజీవి నటించిన ‘హిట్లర్’ సినిమాకు సహాయ దర్శకుడిగా చేశాడట.మళ్లీ ఇన్నాళ్లకు ఆయన సినిమాకు దర్శకత్వం వహించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ దర్శకుడు మోహన రాజ అంటున్నాడు.ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మించబోతున్నాడు.మలయాళంలో సూపర్ హిట్ అయిన సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసీఫర్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి మార్పులు చేర్పులు చేసుకుని వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
ఈ సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ కూడా భాగస్వామిగా ఉండబోతున్నాడు అంటున్నారు.చిరంజీవి వేదాళం సినిమా కంటే ఈ రీమేక్ ను మొదటగా చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటో తెలియదు కాని మోహనరాజ దర్శకత్వంలో ఈ సినిమా అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య సినిమా షూటింగ్ లో ప్రస్తుతం కాజల్ తో కలిసి చిరు నటిస్తున్న విషయం తెల్సిందే.