ఏపీలో రాజకీయ గందరగోళం తలెత్తినట్లు గా కనిపిస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగాజరుగుతున్న వేళ ఏపీలో అకస్మాత్తుగా ఎన్నికలను వాయిదా వేయడం ఏపీ అధికార పార్టీ వైసీపీ ని కలవరపాటుకు గురిచేసింది.
దీంతో ఆ పార్టీ నాయకులంతా ఏకంగా ఎన్నికల కమిషన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఏపీ ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ ను టార్గెట్ చేసుకుంటూ వైసిపి నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
అయితే ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనా వైరస్ ను ఎన్నికల సంఘం కారణంగా చూపించడం మరింత గందరగోళానికి తెరలేపింది.కేవలం వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో ఈ విధంగా చేసిందంటూ విరుచుకుపడుతున్నారు.

ఏపీలో రెండేళ్ల క్రితమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఓటమి భయం తో చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు అని చెబుతూ, వైసీపీ స్థానిక సంస్థల సమరానికి ముందుకు వెళ్ళింది.అలాగే ఈ మార్చి చివరినాటికి ఎన్నికల తంతు పూర్తి చేస్తే ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు వస్తాయని భావించి ఆగమేఘాలమీద ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.ఐదు వల కోట్ల రూపాయలు నిధులు వస్తే పల్లెలు, పట్టణాలను ప్రగతి బాట పట్టించవచ్చని ఏపీ ఎన్నికల సంఘం భావించింది.కానీ ఈసీ నిర్ణయం తో ఒక్కసారిగా వైసీపీకి షాక్ తగిలింది.
ఎన్నికల సంఘం కరోనా వైరస్ ను కారణంగా చూపిస్తోంది.నోటిఫికేషన్ కు ముందు నుంచే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంది.
అయితే కరోనా వైరస్ ప్రభావం ఏపీలో పెద్దగా లేదు.మరో పది రోజులు ఆగితే ఎన్నికలు తంతు పూర్తి అయ్యేది.
కానీ ఆ వైరస్ కారణంగా చూపిస్తూ ఎన్నికలు వాయిదా వేయడం ఒకింత అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుతం వైసీపీ ఈసీ మీద యుద్ధం చేస్తోంది.నిన్నటివరకు ఏపీ శాసనమండలి రద్దు వ్యవహారంతో రాజకీయ రచ్చ జరిగింది.దీనిపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగింది.
అసెంబ్లీలోనూ ఈ వ్యవహారం చిచ్చు రేపింది.వైసీపీ టిడిపి ఇలా ఒకరి మీద ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రాజ్యాంగ వ్యవస్థలను కూడా వివాదాల్లోకి లాగుతున్నారు.
దీని కారణంగా మిగతా రాష్ట్రాల్లో ఏపీ పరువు ప్రతిష్టలు దిగజారుతోంది.ముఖ్యంగా చంద్రబాబు జగన్ ఒకరిమీద ఒకరు పైచేయి సాధించే విధంగా వ్యవహరిస్తున్న తీరు ఏపీ ఆర్థిక అభివృద్ధికి కూడా తీవ్ర నష్టం చేకూరుస్తోంది.
ఈ సందర్భంగా కులాల ప్రస్తావన రావడం ఒక కులం మీద టార్గెట్ చేసుకుంటూ రాజకీయ విమర్శలు చేయడం, ఇవన్నీ గందరగోళం సృష్టిస్తున్నాయి .ఈ వ్యవహారంలో తెలుగుదేశం వైసీపీ ఇద్దరిలో తప్పు ఎవరిది అయినా ఏపీ పరువు మాత్రం బజారున పడుతోంది.ప్రస్తుతం ఎన్నికల రద్దు వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.