తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.రూ.2,90,396 కోట్లతో తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్ ను రూపొందించారు.
రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూల ధన వ్యయం రూ.37,525 కోట్లని మంత్రి హరీశ్ రావు తెలిపారు.తెలంగాణలో తలసరి వృద్ధిరేటు 11.8 శాతంగా ఉందన్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం తలసరి ఆదాయం రూ.3,17,115 అన్న మంత్రి జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువని వెల్లడించారు.రాష్ట్రంలో వ్యవసాయం, పశుసంపదతో పాటు మత్స్య సంపద వృద్ధి చెందిందని తెలిపారు.నీటి పారుదల రంగం అభివృద్ధితో ఇది సాధ్యమైందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఈ ఏడాది బడ్జెట్ లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సర్కార్.ఆ శాఖకు రూ.26,831 కోట్లు కేటాయించింది.ఆయిల్ పామ్ సాగుకు రూ.వెయ్యి కోట్లు, ఇరిగేషన్ కు రూ.26,885 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.12,727 కోట్లు కేటాయింపులు జరిగాయి.
అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు కేటాయించారు.రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు, దళితబంధుకు రూ.17,700 కోట్లు, షెడ్యూల్ కులాల ప్రగతి కోసం రూ.36,750 కోట్లతో పాటు షెడ్యూల్ తెగల ప్రగతి కోసం రూ.15,233 కోట్లు కేటాయించారు.బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు, కల్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్ కోసం రూ.3,210 కోట్లుతో పాటు మహిళా, శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు కేటాయించారు.
తెలంగాణ హరితహారం, అటవీశాఖకు రూ.1,471 కోట్లు, విద్యాశాఖకు రూ.19,093 కోట్లు, కేసీఆర్ కిట్లకు రూ.200 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు, రూ.6,250 కోట్లతో ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు, రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు, హోంశాఖకు రూ.9,599 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.12,161 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.31,426 కోట్లు వార్షిక బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి.