తెలంగాణలో ఫామ్ హౌస్ రాజకీయం వేడెక్కింది.టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టడమే ధ్యేయంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు.
అసలే ఎవరికీ అందనంత స్థాయిలో వ్యూహాలు రచించి, వాటిని అమలు చేయడంలో దిట్టగా పేరు పొందిన టీఆర్ఎస్ పై రేవంత్ దూకుడుగా వెళ్తూ, పైచేయి సాదిస్తున్నట్టుగా కనిపించడం కాంగ్రెస్ లో నూతన ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది.తెలంగాణకు కాబోయే సీఎం గా ప్రచారం జరుగుతున్న కేటీఆర్ పై రేవంత్ దృష్టిసారించారు.
కేటీఆర్ ను రాజకీయంగా దెబ్బ తీస్తే, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తనకు ఎదురు లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలోనే 111 జీవో కు విరుద్ధంగా జన్వాడలో కేసీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారంలో డ్రోన్ కెమెరా ఎగురవేసి రేవంత్ జైలుకి కూడా వెళ్లి వచ్చారు.ఇక గ్రీన్ ట్రిబ్యునల్ ను రేవంత్ ఆశ్రయించడం, కేటీఆర్ కు నోటీసు ఇవ్వడం, దానిపై హైకోర్టు స్టే ఇవ్వడం ఇలా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రేవంత్ విమర్శలకు టిఆర్ఎస్ నుంచి కూడా ప్రతి స్పందన కనిపించింది.కేటీఆర్ కు మద్దతుగా ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్ తో పాటు మండలి విప్ కర్నే ప్రభాకర్ కూడా మీడియా సమావేశాలు నిర్వహించి రేవంత్ ఆరోపణలను ఖండించారు.
కేటీఆర్ కు సొంతంగా ఫామ్ హౌస్ లేదని, 111 జీవో ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులకు గెస్ట్ హౌస్, లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు.ఈ వ్యవహారంలో రేవంత్ తగ్గకుండా ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ దేనంటూ కొన్నిరకాల డాక్యుమెంట్స్ చూపించి మరింత హడావుడి చేశారు.
ఇది ఇలా ఉంటే కొద్దిరోజులుగా రేవంత్ కేటీఆర్ పై, టిఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా, ఆ పార్టీ నుంచి ప్రతి స్పందన కనిపించడం లేదు.రేవంత్ విమర్శలను తిప్పి కొట్టడంలో ముందుండే టిఆర్ఎస్ నాయకులు ఎవరూ ఆ విషయంపై నోరు మెదపడం లేదు.
దీంతో టీఆర్ఎస్ డైలమాలో పడింది.అసలు ఎందుకు మౌనంగా ఉంది అనే విషయం ఎవరికీ అర్థం కాకుండా ఉంది.
కానీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించడంలో దిట్టగా పేరు పొందిన టిఆర్ఎస్ అకస్మాత్తుగా సైలెంట్ అవ్వడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉందనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి.దీనికి తగ్గట్టుగానే 111 జీవో ను అతిక్రమించి కాంగ్రెస్ నాయకులు చాలామంది ఫాంహౌస్ నిర్మించుకున్నారని టిఆర్ఎస్ అనేక కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు వారందరికీ నోటీసులు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందట.ఈ విషయం బయటకు రావడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళనలు మొదలయ్యాయి.అధికార పార్టీని టార్గెట్ చేసుకుందామంటే, తిరిగి తిరిగి తమకే అది తగిలిందని, ఇదంతా రేవంత్ కారణంగానే అని వారంతా ఇప్పుడు రేవంత్ పై ఆగ్రహంగా ఉన్నారు.రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా రేవంత్ ఈ సమస్యనే హైలెట్ చేసుకోవడం ఎందుకని, రైతులు విత్తనాలు దొరక్క, ఎరువులు దొరకక, చాలా ఇబ్బందులు పడుతున్నారని, కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటన్నిటినీ పట్టించుకోవడం మానేసి ఫామ్ హౌస్ రాజకీయాలు చేయడం ఏంటని, ఇప్పుడు సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు.
అలాగే 111 జీవో కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం నోటీసులు ఇస్తే తమ పరిస్థితి ఏంటని ? ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ నష్టపోతుందని విశ్లేషణలు ఇప్పుడు చేసుకుంటున్నారు.