సూర్యాపేట జిల్లా:సిగరెట్ మరియు పొగాకు ఉత్పత్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం కోరారు.గురువారం నాడు వివిధ ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీ బృందాలు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
సిగరేటు మరియు పొగాకు ఉత్పత్తులను నిషేధ చట్టం 2003 సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నిషేధం అని అతిక్రమించినచో 200 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలియజేశారు.సెక్షన్ 5 ప్రకారం పొగాకు ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేధించినట్లు అతిక్రమించిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు అని తెలిపారు.
సెక్షన్ 6 ఏ ప్రకారం విశ్వ విద్యాలయాల చుట్టూ 100 గజముల లోపు పొగాకు నమలడం,ఉత్పత్తులను అమ్మడం నిషేధించడమైనదని తెలిపారు.సెక్షన్ 6 బి ప్రకారం 18 సంవత్సరాలలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం లేదా వారిచే అమ్మకాలు చేపట్టడం నేరమని తెలిపారు.
సూర్యాపేట జిల్లాను పొగాకు రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కోరారు.గుట్కా ఖైనీ తంబాకు లాంటివి నోటి శుభ్రతను నాశనం చేస్తాయని క్యాన్సర్కు కారకాలుగా పరిణమిస్తాయని తెలిపారు.
పొగాకుకు బానిసలైన వారికి ప్రత్యేక డి అడిక్షన్ సెంటర్లు సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రుల యందు అందుబాటులో ఉన్నాయని,ప్రత్యేక మానసిక నిపుణుల పర్యవేక్షణలో ధూమపానం మరియు మద్యపానాన్ని మానివేయడానికి ప్రత్యేక చికిత్స ఉందని తెలిపారు.జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ యువత పొగాకు ఉత్పత్తులు మరియు సిగరెట్ వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలని,వ్యసనాలకు బానిసలుగా ఉండకూడదని తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
నోటి క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆరోగ్య కార్యకర్తల వద్ద నోటి క్యాన్సర్ కు సంబంధించిన ఉచిత పరీక్షలు చేసుకోవాలని కోరారు.
జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి,అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం కోఆర్డినేటర్ భూతరాజు సైదులు,డెమో అంజయ్య,ప్రత్యేక అధికారులు వీరయ్య,యాదగిరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.